Begin typing your search above and press return to search.

ఎంపీ రఘురామ భవిష్యత్ ఏం కానుంది?

By:  Tupaki Desk   |   31 July 2021 1:30 AM GMT
ఎంపీ రఘురామ భవిష్యత్ ఏం కానుంది?
X
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు టైం దగ్గరపడుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఢిల్లీ స్థాయిలో ఆయనకు వ్యతిరేకంగా వైసీపీ అధిష్టానం ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు స్పీకర్ అనర్హత వేటు వేశారు. వైసీపీ ఫిర్యాదుతో రఘురామకు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇచ్చేందుకు స్పీకర్ ఇచ్చిన గడువు ఈరోజుతో ముగిసింది. దీంతో రఘురామపై చర్యలు స్పీకర్ తీసుకుంటారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.

ఒకవేళ రఘురామపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే పార్లమెంట్ లో ఆందోళన చేసేందుకు వైసీపీ ఎంపీలు రెడీ అవుతున్నారు. దీంతో రఘురామ భవితవ్యం తేలేందుకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు విషయంలో లోక్ సభ స్పీకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఆయనకు విధించిన 15 రోజుల గడువు నేటితో పూర్తి కాబోతోంది. ఈనెల 15న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నోటీసులు జారీ చేశారు. వీటిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. ఈ వివరణ ఆధారంగానే ఆయనపై వైసీపీ కోరుతున్న విధంగా అనర్హత వేటు వేయాలా? వద్దా? అన్న విషయంపై లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో రఘురామకృష్ణంరాజు ఇచ్చే వివరణ ఉత్కంఠ రేపుతోంది.

అనర్హత వేటుపై లోక్ సభ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు జోరు పెంచారు. వైసీపీపై దాడిని ఆయన కొన్నిరోజులుగా తీవ్రతరం చేశారు. ముఖ్యంగా జగన్, విజయసాయిరెడ్డి, సజ్జలను టార్గెట్ చేస్తూ రఘురామరాజు చేస్తున్న దాడి పతాకస్థాయికి చేరింది. వారిపై ఉన్న కేసులతోపాటు మిగతా అంశాలను తెరపైకి తెస్తున్నారు.

ఇక రఘురామ తనపై అనర్హత వేటుకు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులో అంశాలకు కౌంటర్లు సిద్ధం చేసుకున్న రఘురామ వాటిని ఇవాళ లోక్ సభ స్పీకర్ కు పంపే అవకాశం ఉంది. అలా కుదరని పక్షంలో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు ఏవైనా సంభవిస్తే నోటీసులపై వివరణ ఇచ్చేందుకు స్పీకర్ ను మరింత గడువు కోరే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే స్పీకర్ నిర్ణయం కీలకంగా మారనుంది.

రఘురామ రాజుకు లోక్ సభ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై వివరణ ఇస్తే తమ తరుఫున కూడా వివరణ ఇచ్చి సాధ్యమైనంత త్వరగా ఈ వ్యవహారం తేల్చాలని వైసీపీ పట్టుదలగా ఉంది. రఘురామ మరింత గడువు కోరితే మాత్రం పార్లమెంట్ లో నిరసనలు చేపట్టడం ద్వారా స్పీకర్ పై ఒత్తిడి పెంచేందుకు కూడా వైసీపీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై సంకేతాలు ఇచ్చేశారు. రఘురామపై ఈ సమావేశాల్లోనే ఎలాగైనా వేటు వేయించేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ.. ఆగస్టు 23న పార్లమెంట్ ముగిసేలాపు వేటుకు పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.