Begin typing your search above and press return to search.

‘వొడాఫోన్ ఐడియా’ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌క‌మేనా?

By:  Tupaki Desk   |   3 July 2021 1:30 AM GMT
‘వొడాఫోన్ ఐడియా’ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌క‌మేనా?
X
దేశీయ టెలికాం రంగంలో కీల‌క మార్పులు చోటు చేసుకుబోతున్నాయా? ప్రముఖ మొబైల్ నెట్వర్క్ కంపెనీ వొడాఫోన్ ఐడియా కంపెనీ మూత‌ప‌డే ఛాన్స్ ఉందా? అంటే.. అవును అనే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వ‌రుస‌గా వ‌స్తున్న‌ భారీ న‌ష్టాలు.. ప్ర‌త్య‌ర్థి కంపెనీల నుంచి ఎదుర‌వుతున్న తీవ్ర పోటీ త‌ట్టుకోలేక‌పోవ‌డంతో కంపెనీ మూసివేత వైపు అడుగులు వేస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఆదిత్య బిర్లా గ్రూప్‌, వొడాఫోన్ గ్రూప్ సంయుక్త కంపెనీ అయిన వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్‌) టెలికాం కంపెనీ షేర్లు.. గ‌త కొంత కాలంగా ప‌డిపోతున్నాయి. అయితే.. గ‌డిచిన‌ రెండు రోజుల్లో ఐడియా వొడాఫోన్ షేర్లు మ‌రింత భారీగా ప‌డిపోవ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది.

జూలై 1వ తేదీన వొడాఫోన్ ఐడియా షేర్లు ఏకంగా 8.54 శాతం క్షీణించాయి. ఈ కంపెనీకి 2021 ఆర్థిక సంవ‌త్స‌రంలో మొత్తం రూ.44,233 కోట్ల న‌ష్టం వాటిల్లింది. జ‌న‌వ‌రి మార్చి త్రైమాసికంలోనే 6,985 కోట్లు న‌ష్ట‌పోయింది. ఓ వైపు ఈ న‌ష్టాలు వేధిస్తుంటే.. మ‌రోవైపు క‌స్ట‌మ‌ర్ల సంఖ్య కూడా త‌గ్గిపోతోంది. కేవ‌లం ఈ ఏడాది తొలి త్రైమాసికం (జ‌న‌వ‌రి - మార్చి)లోనే ఏకంగా 20 ల‌క్ష‌ల మంది చందాదారులు ఇత‌ర నెట్వ‌ర్క్ లోకి మారిపోయారు.

ఈ విధంగా స‌క‌ల స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా కంపెనీ.. తాజా స్పెక్ట్ర‌మ్ చెల్లింపులు కూడా చేప‌ట్ట‌లేక‌పోతోంది. ఇందుకోసం ఏడాది పాటు మార‌టోరియం ఇవ్వాల‌ని టెలికాం శాఖ‌ను కోరడం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు గ‌త నెల 25న డాట్ కార్య‌ద‌ర్శికి లేఖ కూడా రాసింది. త‌మ ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బును ఇత‌ర బ‌కాయిల‌కే చెల్లించాల్సి వ‌స్తోంద‌ని, అందువ‌ల్ల వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో చెల్లించాల్సిన 8,292 కోట్ల‌ను చెల్లించ‌లేమ‌ని, అందువ‌ల్ల మ‌రో ఏడాదిపాటు స‌మ‌యం ఇవ్వాల‌ని కోరింది.

రిల‌య‌న్స్ జియో వ‌చ్చిన త‌ర్వాత.. దేశీయ టెలికాం రంగంలో భారీగా మార్పులు సంభవించాయి. తొలుత కొన్ని నెల‌ల‌పాటు ఉచితంగా డాటా, కాల్స్ అందించిన జియో.. ఇత‌ర నెట్వ‌ర్కుల్లో ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌ను సాధ్య‌మైనంత మేర లాగేసింది. చౌక ధ‌ర‌ల‌కు డాటా, కాల్స్ ఇస్తుండ‌డంతో.. వొడాఫోన్ ఐడియాతోపాటు ఇత‌ర కంపెనీలు నిల‌బ‌డలేక‌పోతున్నాయి. జియోకు పోటీగా ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌లేక‌, క‌స్ట‌మ‌ర్ల‌ను కాపాడులేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే.. భారీగా న‌ష్టాలు చ‌విచూస్తున్న వొడాఫోన్ ఐడియా పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయింది. ఇదే ప‌రిస్థితి కొనసాగితే మూత‌ప‌డే అవ‌కాశం కూడా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.