Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముక్క‌లు చేసే ప్లాన్?

By:  Tupaki Desk   |   25 Feb 2019 11:26 AM GMT
ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముక్క‌లు చేసే ప్లాన్?
X
నోటి వ‌ర‌కూ వ‌చ్చి అధికారం చేజారితే ఎవ‌రికైనా ఒళ్లు మండుతుంది. అందులోకి సంబ‌రాలు చేసుకొన్నాక‌.. అధికారం చేజారితే క‌లిగే క‌ష్టం అంతా ఇంతా కాదు. అందునా మోడీ మాష్టారు కేంద్రంలో ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు ఇలా జ‌ర‌గ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న ప‌లువురు క‌మ‌ల‌నాథుల‌కు రావ‌టం తెలిసిందే. అందుకే.. న్యాయ‌మా? అన్యాయ‌మా? అన్న విష‌యాల్ని ప‌క్క‌న పెట్టి క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌..జేడీఎస్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించ‌ట‌మే లక్ష్యంగా జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాలు అన్నిఇన్ని కావు.

ప‌లుమార్లు కుమార‌స్వామి ప్ర‌భుత్వాన్ని కూల‌దోసే ప్ర‌య‌త్నాల్ని క‌మ‌ల‌నాథులు చేయ‌టం.. దాన్ని స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌టం తెలిసిందే. ఎన్ని ఎదురుదెబ్బ‌లు త‌గిలినా క‌న్న‌టనాట కాషాయ జెండా ఎగ‌రాల‌న్న త‌ప‌న క‌మ‌ల‌నాథుల్లో క‌నిపిస్తూనే ఉంది. దీంతో ఏ రోజున క‌ర్ణాట‌క సంకీర్ణ ప్ర‌భుత్వానికి నూక‌లు చెల్లుతాయో అర్థం కాని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఊహించ‌ని యాంగిల్ లో కుమార‌స్వామి ప్ర‌భుత్వానికి కొత్త క‌ష్టం వ‌చ్చింది. ఆ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి జి. ప‌ర‌మేశ్వ‌ర భారీ షాక్ ఇచ్చారు. తాను ద‌ళితుడ్ని కాబ‌ట్టే త‌న‌కు సీఎం అవ‌కాశం లేద‌న్నారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ఒప్పుకున్నాన‌ని చెప్పారు.

జేడీఎస్ నేత కుమార‌స్వామికి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఇవ్వ‌టంపై కాంగ్రెస్ నేత‌లు అసంతృప్తితో ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికే సంకీర్ణ స‌ర్కారు లుక‌లుక‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్న వేళ ప‌ర‌మేశ్వ‌ర కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దేవ‌నాగ‌రేలో జ‌రిగిన ద‌ళితుల ర్యాలీలో మాట్లాడిన ప‌ర‌మేశ్వ‌ర మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అణిచివేత‌లో తాను కూడా బాధితుడినేన‌ని.. ద‌ళితుడ్ని కాబ‌ట్టే త‌న‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌న్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ లోని ప‌లువురు ద‌ళిత నేత‌ల్ని ప్ర‌స్తావించిన ప‌ర‌మేశ్వ‌ర‌.. స‌దరు నేత‌లు రాష్ట్రాన్ని న‌డిపించే ఛాన్స్ మిస్ అయ్యార‌న్నారు.

దీంతో.. ప‌లువురు ద‌ళిత నేత‌లు సంకీర్ణ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఏమైనా పావులు క‌దుపుతున్నారా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతున్న ప‌రిస్థితి. ప‌లువురు నేత‌ల పేర్లు (బసవలింగప్ప - కేహెచ్ రంగనాధ్ - కలబుర్గి ఎంపీ మల్లికార్జున ఖర్గే తదితర నేతలు) ప్ర‌స్తావిస్తూ.. వారంతా ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కోల్పోయార‌న్నారు. ఇప్ప‌టికి క‌ర్ణాట‌క‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ద‌ళితులు అస్పృశ్య‌త‌కు గుర‌వుతున్న‌ట్లుగా ఆరోపించారు. ఊహించ‌ని రీతిలో తెర మీద‌కు తాజా అసంతృప్తి కుమార‌స్వామి ప్ర‌భుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.