Begin typing your search above and press return to search.

గాలి ప్ర‌త్య‌ర్థికి షాక్‌..క‌న్న‌డ డిప్యూటీ సీఎం ఆయ‌నే

By:  Tupaki Desk   |   22 May 2018 4:03 PM GMT
గాలి ప్ర‌త్య‌ర్థికి షాక్‌..క‌న్న‌డ డిప్యూటీ సీఎం ఆయ‌నే
X
క‌ర్ణాట‌క రాజ‌కీయాల ట్విస్టుల ప‌రంప‌ర‌కు తెర‌ప‌డింది. ఎన్నిక‌ల ఫ‌లితాల విడుద‌ల నుంచి మొద‌లుకొని సాగిన అనేక ఉత్కంఠ‌ల ప‌రంప‌ర తాజాగా ప‌ద‌వుల పంప‌కంతో ముగిసింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌ లో కీల‌క పాత్ర పోషించిన నేత‌కు మాత్రం చుక్కెదురు అయింది. ఆయ‌నే పార్టీ సీనియ‌ర్ నేత - మాజీ మంత్రి డీకే శివ‌కుమార్‌. బీజేపీ నుంచి అధికారాన్ని కైవ‌సం చేసుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ఈ నాయ‌కుడికి అధిష్టానం నిరాశ‌నే మిగిల్చింది.

క‌ర్ణాటకలో మంత్రి పదవులపై కాంగ్రెస్-జేడీఎస్ ల మధ్య ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ సీఎం ఇచ్చేందుకు కుమారస్వామి ఒకే చెప్పారు. 22 రెండు మంత్రి పదవులు కాంగ్రెస్ కు - 12 మంత్రి పదవులు జేడీఎస్ కు దక్కాయి. అసెంబ్లీ స్పీకర్ గా కాంగ్రెస్ అభ్యర్ధి ఉండనుండగా - డిప్యూటీ స్పీకర్ గా జేడీఎస్ అభ్యర్ధి ఉంటారు. బుధవారం(మే-23) సీఎంగా కుమారస్వామి - డిప్యూటీ సీఎంగా పరమేశ్వర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచిన తరువాతనే మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు.

కాగా, అనేక ఉత్కంఠ‌త‌ల మ‌ధ్య కొన‌సాగిన క్యాంప్ రాజ‌కీయాల్లో డీకే శివ‌కుమార్ కీల‌క పాత్ర పోషించారు. ఏకంగా బీజేపీ సీనియ‌ర్ నేత‌ - మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న్ రెడ్డికి షాక్‌ లు ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేల క్యాంప్‌ ను గాలి జ‌నార్ద‌న్ రెడ్డి అన్నీ తానై నిర్వ‌హించారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ త‌న ఎమ్మెల్యేల‌ను కాపాడుకునేందుకు వారిని రిసార్ట్‌ ల‌కు త‌ర‌లించింది మొదలుకొని బీజేపీ ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా అన్ని జాగ‌త్ర‌లు తీసుకుంది మాజీ మంత్రి డీకే శివ‌కుమార్. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన డీకే శివ‌కుమార్ దేశంలోనే అత్యంత ధ‌నికుడైన ప్ర‌జాప్ర‌తినిధిగా గుర్తింపు పొందారు. త‌న అఫిడ‌విట్లోనే రూ.730 కోట్ల ఆస్తుల‌ను చూపించిన శివ‌కుమార్ క్యాంప్‌ ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించి గాలికి చెక్ పెట్టిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని అనుకున్నారు. అయితే ఆయ‌న‌కు నిరాశే ఎదురైంది.