Begin typing your search above and press return to search.

ట్యాంక్ బండ్ మీద కాకా. కేసీఆర్ మార్క్ నిర్ణయం

By:  Tupaki Desk   |   24 Sep 2015 5:00 AM GMT
ట్యాంక్ బండ్ మీద కాకా. కేసీఆర్ మార్క్ నిర్ణయం
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను అంచనా వేయటం అంత తేలికైన వ్యవహారం కాదు. కాకలు తీరిన రాజకీయ విశ్లేషకులు సైతం షాకిచ్చే తత్వం ఆయన సొంతం. ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారన్నది ఆయన సన్నిహితులు కూడా చటుక్కున చెప్పలేరు. విషయం ఏదైనా ఆయన నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక లోతైన ఆలోచన ఏదో ఒకటి ఉంటుంది.

కొందరిపట్ల పెద్ద కారణం లేని కోపం.. మరికొందరి మీద అంతులేని మమకారం ప్రదర్శించటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యం. రాజకీయ నాయకులుగా ఇలాంటి పని చేయలేరని ఫిక్స్ అయిన పనిని చేసి మరీ చూపించే విలక్షణతో పాటు.. విమర్శలు ఎన్ని ఎదురైనా తాను అనుకున్న పనిని పూర్తి చేసే మొండితనం ఆయన సొంతం. తాజాగా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం చూస్తే.. కేసీఆర్ మజాకానా అనిపించక మానదు.

సీనియర్ కాంగ్రెస్ నేత.. కాకాగా సుపరిచితులైన దివంగత నేత జి. వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోవటమే కాదు.. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను తాజాగా జారీ చేశారు. అధికారిక నిర్ణయాల్లో దొర్లే తప్పుల్ని ఏమాత్రం లేకుండా అత్యంత జాగ్రత్తగా దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయటం గమనార్హం.

హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి మాత్రమే విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా విస్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రాజకీయ నాయకుడి విగ్రహాన్ని.. అది టీఆర్ ఎస్ కు ఏ మాత్రం సంబంధం లేని నాయకుడి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని భావించటం విశేషం.

తెలంగాణ ఉద్యమరూపకర్త అయిన ప్రొఫెసర్ జయశంకర్ మాష్టారు.. మరెందరో తెలంగాణ ప్రముఖులకు దక్కని అరుదైన గౌరవం కాకాకు దక్కనుంది. దళిత వర్గానికి చెందిన కాకా విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలన్న నిర్ణయం.. వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా పలువురు చెబుతున్నారు. అయితే.. ఆ వాదనలో పస లేదనే చెప్పాలి. కేసీఆర్ లాంటి నేత.. ఒక ఉప ఎన్నిక కోసం ట్యాంక్ బండ్ మీద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకుంటారనుకుంటే పొరపాటే. అంతకు మించిన వ్యూహమే ఉండి ఉండాలి. ఎందుకంటే.. ఈ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ అన్న విషయం మర్చిపోకూడదు.