Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ కు వెన్నుపోటులో కేసీఆర్ ఈ పాత్ర పోషించారా?

By:  Tupaki Desk   |   12 Aug 2019 1:59 PM GMT
ఎన్టీఆర్‌ కు వెన్నుపోటులో కేసీఆర్ ఈ పాత్ర పోషించారా?
X
తెలుగు దేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ ప‌ద‌వీచ్యుతుడు అయిన ఎపిసోడ్ గురించి ర‌క‌ర‌కాల అభిప్రాయాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. పార్టీని - ప్ర‌భుత్వాన్ని కాపాడుకునేందుకు చంద్ర‌బాబు నాయుడు చేసిన ప‌ని స‌రైన‌దే అని కొంద‌రి వాద‌న కాగా...ఆయ‌న్ను అన్యాయంగా ప‌ద‌వి నుంచి దించేశారని, బాబు గారి వెన్నుపోటు చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని ఇంకొంద‌రి విమ‌ర్శ‌. ఏది ఏమైనా ఈ కీల‌క‌మైన రాజ‌కీయ ఘ‌ట్టంలో పాలుపంచుకున్న ఆనాటి నాయ‌కుల గురించి స‌హ‌జంగానే ఎప్ప‌టికైనా ఆస‌క్తి ఉంటుంది. అలాంటి ఆస‌క్తి ఉంది కాబ‌ట్టే...తాజాగా బీజేపీలో చేరిన ఓ ముఖ్య‌నేత ఈ ప‌రిణామంపై స్పందించారు. అయితే ఇందులో ప్ర‌స్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర గురించి ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌కీ ఆ స్పందించిన నేత ఎవ‌రంటే....మాజీ ఎంపీ వివేక్‌.

ఇటీవ‌లే బీజేపీలో చేరిన వివేక్ త‌న అనుచ‌రులు - పలు పార్టీల నేతలు - కార్యకర్తలకు హైద‌రాబాద్‌ లోని పార్టీ ఆఫీసులో కాషాయ కండువా క‌ప్పారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ - కేసీఆర్‌ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. నమ్మించి వెన్నుపోటు పొడవడంలో కేసీఆర్ దిట్ట అని తెలిపారు. నాడు టీడీపీ వ్య‌వస్థాప‌కుడు ఎన్టీఆర్‌ వెన్నుపోటు పొడిచే దాంట్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించార‌ని ఆరోపించారు. ఇప్పుడు మేన‌ల్లుడు హ‌రీష్‌ రావు విష‌యంలోనూ అదే జ‌రుగుతోంద‌ని అన్నారు. మహాబూబ్‌ న‌గర్ ఎన్నికల ఇంచార్జిగా హరీష్ రావును నియమించి.. గెలిచిన తర్వాత హరీష్ రావు గొంతు కోశారని చెప్పారు. ఉద్యమ కారులు అంటేనే కేసీఆర్‌ కు పడదని దుయ్య‌బ‌ట్టారు.

ప్రజల కోసమే తెలంగాణ గురించి కొట్లాడతున్నామని చెప్పిన కేసీఆర్..ఇప్పుడు కల్వకుంట్ల తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నారని వివేక్ ఆరోపించారు. ప్రజాస్వామిక తెలంగాణ గురించి కేసీఆర్ మర్చిపోయారని, సొంత కుటుంబ తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నారని మండిప‌డ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని..ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. త‌న గురించి ప్ర‌స్తావిస్తూ - బీజేపీలో చేర‌డంతో మంచి నిర్ణయం తీసుకున్నారని చాలా మంది తెలిపారని వివేక్ చెప్పుకొచ్చారు.