Begin typing your search above and press return to search.

ఒక్క‌రోజైనా సీఎంను అవుతానంటున్న గాలి జ‌నార్ద‌న్ రెడ్డి!

By:  Tupaki Desk   |   23 Jun 2022 6:30 AM GMT
ఒక్క‌రోజైనా సీఎంను అవుతానంటున్న గాలి జ‌నార్ద‌న్ రెడ్డి!
X
అక్రమార్కుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లింది.. ఓబుళాపురం మైన్స్‌. గాలి బ్రదర్స్‌ (గాలి జనార్ధన్‌ రెడ్డి, గాలి కరుణాకర్‌రెడ్డి, గాలి సోమశేఖరరెడ్డి), బీజేపీ నేత శ్రీరాములు (ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో మంత్రి) తదితరులు ఓబుళాపురం మైన్స్‌ను చెరపట్టారని 2008లో తీవ్ర విమర్శలు, ఆరోపణలు రేగాయి. అప్పట్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న గాలి జనార్ధన్‌రెడ్డి.. నాటి కర్ణాటక సీఎం యడ్యూరప్ప, అప్పటి ఏపీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అండదండలతో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

నిబంధనలకు పాతరేసి.. పర్యావరణ అనుమతులు తోసిరాజని.. కొంతమంది అధికారులను బెదిరించి.. కొంతమందికి ముడుపులు ఇచ్చి ఓబుళాపురంలో ఐరన్‌ ఓర్‌ను అక్రమంగా తవ్వుకుని వందల కోట్ల రూపాయలు లబ్ధి పొందారని గాలి జనార్దన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

తర్వాత ఈ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి జైలుపాలు కూడా అయ్యారు. బెయిల్‌ కోసం న్యాయమూర్తికి ఐదు కోట్ల రూపాయలు ఆఫర్‌ చేసి జనార్దన్‌రెడ్డికి చెందిన వ్యక్తులు సంచలనం సృష్టించారు. ప్ర‌స్తుతం ఈ కేసుల్లో గాలి జ‌నార్ద‌న్ రెడ్డి బెయిల్ పై ఉన్నారు.

గ‌తేడాది త‌న కుమార్తెకు అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసిన గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న సోద‌రుడు గాలి సోమ‌శేఖ‌ర‌రెడ్డి 57వ పుట్టిన రోజును బ‌ళ్లారిలోని ఓ క‌ల్యాణ మండ‌పంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గాలి జ‌నార్ద‌న్ రెడ్డి మాట్లాడుతూ.. తాను మ‌న‌సు పెడితే ఒక్క రోజైనా ముఖ్య‌మంత్రిని అవుతానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రెడ్డి బ్రదర్స్‌కు, మంత్రి శ్రీరాములుకు డబ్బుపై ఆశ లేద‌ని చెబుతున్నారు. త‌న‌కు శాసనసభ్యుడు, మంత్రి కావాలని ఆశ లేద‌ని పేర్కొంటున్నారు. ఉంటే ఒక్క రోజైనా ముఖ్యమంత్రి అవుతానంటూ గాలి జ‌నార్ద‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అలాగే త‌న‌ను ఇబ్బందులు పెట్టాలంటూ కొంద‌రు ఆదేశాలు జారీ చేసిన‌ట్టు సీబీఐ అధికారులు తెలిపార‌ని బాంబు పేల్చారు. కాగా ఒక్క రోజైనా ముఖ్య‌మంత్రి అవుతానంటూ గాలి జ‌నార్ద‌న్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన వెంటనే కార్యకర్తలు ఆయనపై పూల జ‌ల్లు కురిపించారు.