Begin typing your search above and press return to search.

గబ్బర్ రిటర్న్స్.. శిఖర్ సెంచరీతో చెన్నై చిత్తు!

By:  Tupaki Desk   |   18 Oct 2020 4:10 AM GMT
గబ్బర్ రిటర్న్స్..  శిఖర్ సెంచరీతో చెన్నై చిత్తు!
X
ఆహా..ఎన్నాళ్లకెన్నాళ్లకు అసలు సిసలు శిఖర్ ధావన్ ని చూసి.. ఇది కదా.. అభిమానులు శిఖర్ నుంచి కోరుకుంది. భారీ లక్ష్యం ముందున్నా.. సహచర బ్యాట్స్ మెన్ ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా.. జట్టంతా కలసి తనమైన స్కోర్ చేయకున్నా శిఖర్ ఒక్కడే ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. చివరి వరకూ గెలుపు మాదేననుకున్న చెన్నైకి పరాభవం మిగిల్చాడు. ఐపీఎల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అతడేమీ సిక్సులతో విరుచుకు పడలేదు. ఎప్పటిలా తన మార్క్ క్లాస్ ఆట తీరుతో గ్యాప్ దొరికితే చాలు బంతిని బౌండరీకి తరలిస్తూ ఏకంగా 14 ఫోర్లు, ఓ చక్కటి సిక్సర్ బాదాడు. మునుపటి ధావన్ ని తలపించాడు. చివర్లో కాస్త టెన్షన్ పడ్డా అక్షర్ పటేల్ బ్యాటింగ్ విన్యాసం ఢిల్లీ క్యాపిటల్స్ కి అద్భుత విజయాన్ని కట్టబెట్టింది. పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్ర స్థానానికి చేరింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 179 పరుగులు సాధించింది.సామ్‌ కరాన్‌ మొదట్లోనే డకౌట్ అయినా డుప్లెసిస్‌-షేన్‌ వాట్సన్‌ జోడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టింది. వారిద్దరూ రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
వాట్సన్‌ 28 బంతుల్లో,(6 ఫోర్లు ) 36 పరుగులు చేశాడు. డుప్లెసిస్ (58; 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అంబటి రాయుడు(45 నాటౌట్‌; 1ఫోర్‌, 4 సిక్స్‌లు) రవీంద్ర జడేజా(33 నాటౌట్‌; 13 బంతుల్లో 4 సిక్స్‌లు) రాణించడంతో
సీఎస్‌కే 179 పరుగులు చేసింది. ధోనీ (3) మరోసారి విఫలం అయ్యాడు.

ఛేదనలో ఢిల్లీకి మొదట్లోనే షాక్ తగిలింది. దీపక్‌ చహర్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే పృథ్వీ షా డకౌట్‌ అయ్యాడు. అజింక్యా రహానే(8) కూడా మరోసారి విఫలం అయ్యాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(23; 23 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), స్టోయినిస్‌(24;14 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) కొద్ది సేపు పోరాడారు. ధావన్‌ కడ దాకా క్రిజులో ఉండి సెంచరీతో ఆకట్టుకున్నాడు.

చెన్నైని ఆటాడిన అక్షర్ పటేల్

ధావన్ సెంచరీ చేసినా ఢిల్లీ చివర్లో కష్టాల్లో పడింది. చివరి ఓవర్లో ఢిల్లీకి 17 పరుగులు అవసరం కాగా జడేజా బౌలింగ్లో మూడు సిక్సర్లు బాదాడు. ఏకంగా 5 బంతుల్లోనే 21 పరుగులు చేసి మ్యాచ్ ని రెండు బంతులు ఉండగానే ముగించాడు.

ధావన్ దంచుడు

ఈ మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణ ధావనే. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా చివరి దాకా ఆడాడు. రన్ రేట్ పడిపోకుండా దూకుడుగా ఆడాడు. బౌండరీలతోనే ధావన్ 62 పరుగులు సాధించాడు. మునుపటి ధావన్ కళ్ళముందు కదిలేలా బ్యాటింగ్ చేశాడు.