Begin typing your search above and press return to search.

ఇప్పటికి పానీపూరి తినొద్దు.. తెలంగాణ ప్రజలకు కీలక అధికారి హెచ్చరిక

By:  Tupaki Desk   |   13 July 2022 6:30 AM GMT
ఇప్పటికి పానీపూరి తినొద్దు.. తెలంగాణ ప్రజలకు కీలక అధికారి హెచ్చరిక
X
తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులుగా సుపరిచితులు గడల శ్రీనివాసరావు కీలక హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టైపాయిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న వైనాన్ని వెల్లడించటంతో పాటు.. పట్టణ ప్రాంతాల ప్రజలు ఎంతో ఇష్టంగా తినే పానీపూరి కారణంగా టైపాయిడ్ బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. పానీపూరీ బండ్ల దగ్గర శుభ్రత లేకపోవటం.. వారు వాడే నీళ్లు సురక్షితమైనవి కాకపోవటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

అందుకే.. ఈ సీజన్ లో పానీపూరీ తినకపోవటమే మంచిదన్న ఆయన.. వాటి జోలికి వెళ్లొద్దన్న వార్నింగ్ ఇచ్చారు. పానీపూరి.. తోపుడు బండ్ల వాళ్లు ఆహార పదార్థాల తయారీ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని.. శుభ్రమైన నీటిని వినియోగించాలన్నారు.

కాచి.. చల్లార్చిన నీటితోనే పానీపూరీని తయారు చేయాలన్న ఆయన.. అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న తోపుడు బండ్ల మీద ఆహారం తింటే తిప్పలు తప్పవన్న మాట చెప్పారు.

పది రూపాయిలు పెట్టి పానీపూరీ తింటే.. ఆరోగ్య సమస్యల కారణంగా వైద్యానికి రూ.10 వేలు ఖర్చు పెట్టే ప్రమాదం ఉంటుందన్న ఆయన.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు.. ఇళ్లల్లోనూ శుభ్రతను పాటించాలన్నారు. మిషన్ భగీరథ కారణంగా కలుషిత నీటి సమస్య తగ్గిందన్న ఆయన.. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా తక్కువగా ఉందని చెప్పారు.

మొత్తంగా చూస్తే.. చూసినంతనే నోరూరించే పానీ పూరి విషయంలో నియంత్రణ అవసరం. ఆ విషయంలో ఏ మాత్రం తొందర పాటు పడినా.. అనారోగ్యాన్ని 'కొని' తెచ్చుకున్నట్లే అవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

గడల శ్రీనివాసరావు దెబ్బతో పానీ పూరీ వ్యాపారానికి కొద్ది రోజుల పాటు గడ్డు పరిస్థితి ఖాయమన్న మాట వినిపిస్తోంది. ప్రజారోగ్యంతో పోలిస్తే.. కొద్దిమంది వ్యాపారులు ఇబ్బంది పడటంలో తప్పేం లేదు.