Begin typing your search above and press return to search.

గడప గడపకు గవర్నమెంట్... ఫెయిల్యూర్ అయిందా...లాజిక్ ఇదేనా...?

By:  Tupaki Desk   |   14 Dec 2022 11:30 AM GMT
గడప గడపకు గవర్నమెంట్... ఫెయిల్యూర్ అయిందా...లాజిక్ ఇదేనా...?
X
గడప గడపకు మన ప్రభుత్వం. వైసీపీ పెద్దలు గొప్పగా చెప్పుకుంటున్న కార్యక్రమం. ఆరు నెలలుగా ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కలసి ఇల్లిళ్ళూ తిరిగి ప్రజల కష్ట సుఖాలు అన్నీ జాగ్రత్తగా చూసుకొంటున్నారు తెగ ఊదరగొడుతున్నారు. ఎండనకా వానననా ఎమ్మెల్యేలు ప్రతీ ఊరూ వాడా కలియతిరుగుతున్నారని, రాత్రీ పగలు చూసుకోకుండా ఒళ్ళు దాచుకోకుండా తెగ కష్టపడుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు.

సరే ఇన్నాళ్ళూ గడచింది ఒక ఎత్తు అనుకుంటే ప్రజలకు అసలైన కష్టాలు వచ్చి వారు పుట్టెడు ఇబ్బందులలో ఉన్నపుడు ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించారు అని కదా చర్చ. ఇపుడు అలాంటి పరిస్థితులే ఏర్పాడ్డాయి. మాండూస్ తుపాను కారణంగా దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమ జిల్లాలు అయిన కడప, అన్నమయ్య జిల్లాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

అసలే రోడ్లు బాగులేవు, ఈ వానలకు అవి పూర్తిగా గుంతలుగా ఏర్పడ్డాయి. ఇక నీరు అంతా ఇళ్ళలోనే ఉంటోంది. జనాలు ఏమి తినేందుకు లేదు, వారంతా వరుణ ప్రతాపానికి చిగురుటాకులా వణికిపోతూంటే ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్ళి ఏం చేశారు అన్నది ఇపుడు చర్చగా ఉంది. తమ ప్రభుత్వం మూడున్నరేళ్ళుగా చెసిన సంక్షేమ పధకాలు ఇవిగో అంటూ కరపత్రాలు పంచుకుంటూ ఎమ్మెల్యేలు వచ్చిన దోవనే వెళ్ళిపోతున్నారు తప్ప కనీసం తమ కష్టాలను గురించి అడగలేదు, తీర్చేందుకు దృష్టి పెట్టలేదు అని ఆయా జిల్లాల ప్రజానీకం మండిపడుతున్నారు.

గడప దగ్గరకు వచ్చిన ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను విని పరిష్కారం చూపిస్తే బాగుండేది కానీ వారు అలా చేయకుండా తప్పించుకుని పోతున్నారు అని ఆరోపిస్తున్నారు. అంతే కాదు తాము ఇదీ మా బాధ అని చెప్పినా వినకుండా వెళ్లిపోతున్నారు అని మండిపడుతున్నారు.గడప గడపకు ఎందుకు వస్తున్నారో కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు అని అంటున్నారు. ఎమ్మెల్యేలు వస్తే తమ సమస్యలు పరిష్కారం కావాలి. గడపకు ప్రభుత్వం వస్తే తమ ఇబ్బందులు తొలగాలి.

అలాంటిది తామే తమ బాధలను ఏకరువు పెడుతూంటే కూడా పట్టనట్లుగా వెళ్ళిపోతున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అని అంటున్నారు. ఇక చాలా చోట్ల వచ్చిన ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. ఈ చిత్తడి రోడ్లేంటి, ఈ గంతలను ఎందుకు పూడ్చడంలేదు, దీని వల్లనే కదా వాన వచ్చినపుడు ఇళ్లలోకి వర్షం నీళ్ళు వెల్లువలా వస్తున్నాయని కూడా వారిని నిలదీస్తున్నారు.

ఎన్నో సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకోకపోవడం వల్లనే కదా ఈ రోజు ఇలా తుపాను వల్ల చిక్కుల్లో పడిపోయామని చెబుతూ ఎమ్మెల్యేల మీద మండిపడుతున్నారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం జస్ట్ అలా వచ్చి తమ ప్రభుత్వం చేస్తున్నది ఇదీ అంటూ కరపత్రాలను పంచుతూ పోతున్నారు తప్ప జవాబు చెప్పలేని నిస్సయాహతతో ఉన్నారని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే గడప గడపకు మన గవర్నమెంట్ అన్న కార్యక్రమం సూపర్ హిట్ అని పొంగిపోతున్న ప్రభుత్వానికి ఎమ్మెల్యే తీరుతో అది పూర్తిఫా ఫెయిల్ అని అర్ధమైపోతోంది అని అంటున్నారు. సమస్యలు తీర్చలేని ఆర్చలేని ఎమ్మెల్యేలు గడప దగ్గరకు వస్తే ఏంటి, రాకుంటే ఏంటి అన్నది జనం మాటగా ఉంది. ఇలా ప్రభుత్వ అసమర్ధతను నిర్వాకాన్ని నిర్లక్ష్యాన్ని ఎమ్మెల్యేలు గడప గడప వద్ద బట్టబయలు చేసుకున్నారు అని కామెంట్స్ పడుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.