Begin typing your search above and press return to search.

గ‌ద్ద‌ర్ గ‌ళం విప్పారు!..మ‌రో ఉద్య‌మ‌మేన‌ట‌!

By:  Tupaki Desk   |   28 April 2019 5:08 PM GMT
గ‌ద్ద‌ర్ గ‌ళం విప్పారు!..మ‌రో ఉద్య‌మ‌మేన‌ట‌!
X
గ‌ద్ద‌ర్‌... ప్ర‌జా గాయ‌కుడిగా జ‌నాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న ఉద్య‌మ నేత‌, తెలుగు నేల‌లో న‌క్స‌ల్బ‌రీ హోరులో ప‌ద్యం ప‌ట్టి గ‌ళం విప్పి గ‌ద్ద‌ర్ చేసిన విన్యాసాలు జ‌నాల‌ను ఎంతో ప్ర‌భావితం చేశాయి. వ‌ర‌వ‌ర‌రావు, క‌ళ్యాణ‌రావు లాంటి నేత‌లు పౌర హ‌క్కుల పేరిట ఉద్య‌మం న‌డిపితే.. గ‌ద్ద‌ర్ వారి గొంతుకై న‌డిచారు. తెలంగాణ ఉద్య‌మంలోనూ ఓ మోస్త‌రు పాత్ర‌నే పోషించిన గ‌ద్ద‌ర్ పై ఆ ఉద్య‌మానికి ముందు ఏకంగా హ‌త్యాయ‌త్న‌మే జ‌రిగింది. ఆ త‌ర్వాత కాస్తంత జోరు త‌గ్గించేసిన గ‌ద్ద‌ర్ అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఇటీవ‌లి కాలంలో అస‌లు గ‌ద్ద‌ర్ క‌నిపించ‌డమే లేదు. అయితే ఇదంతా నిన్న‌టిదాకే. ఇప్పుడు గ‌ద్ద‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. గ‌ళం విప్పారు. ఉద్య‌మ నినాదాన్ని మోగించేశారు.

ఎవ‌రి మీద గ‌ద్ద‌ర్ పోరు బాట‌ను ప్ర‌క‌టించారంటే... ఇంకెవ‌రు తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్‌పైనా, ఆ పార్టీ అధినేత‌, సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు మీదే. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న తాజా ప‌రిస్థితుల‌ను ప్ర‌స్తావించిన గ‌ద్ద‌ర్ రాష్ట్రంలో మ‌రో ఉద్య‌మానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎంగా కేసీఆర్ సాగిస్తున్న పాల‌న‌ను నిరంకుశ పాల‌న‌గానే అభివ‌ర్ణించిన గ‌ద్ద‌ర్‌... ఆ పాల‌న‌పైనే త‌న పోరు అని ప్ర‌క‌టించేశారు. ఉద్య‌మ స‌మ‌యంలో నిధులు, నీళ్లు, నియామకాలు అన్నారు క‌దా... నీళ్లు ఏవీ? నియామ‌కాలు ఏవి? అంటూ ఆయ‌న స్వ‌రం పెంచేశారు. నీళ్లు, నియామ‌కాలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ నిల‌దీశారు.

సీఎం కేసీఆర్ సాగిస్తున్న నిరంకుశ పాల‌న‌ను తెలంగాణ ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌ని చెప్పిన గ‌ద్ద‌ర్‌... రాష్ట్రంలో మ‌రో ఉద్య‌మం మొద‌ల‌వుతోంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఇక ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల‌లో 16 సీట్లు గెలుస్తామంటున్న కేసీఆర్‌... ఆ సీట్ల‌తో ఏం చేస్తారో చెప్పాల‌ని కూడా గ‌ద్ద‌ర్ నిల‌దీశారు. తాజా పరిణామాలు చూస్తుంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గద్దర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశారు. మొత్తంగా గ‌ద్ద‌ర్ గ‌ళం పెంచితే...కేసీఆర్ ఏ రీతిన వ్య‌వ‌హ‌రిస్తార‌న్న విష‌యం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌నే చెప్పాలి.