Begin typing your search above and press return to search.

గద్దర్... మందక్రిష్ణా ఇదేమి తీరు ?

By:  Tupaki Desk   |   1 Dec 2018 5:24 AM GMT
గద్దర్... మందక్రిష్ణా ఇదేమి తీరు ?
X
తెలంగాణ ఎన్నికలలో ప్రజాకూటమికి బహిరంగంగా మద్దతు తెలిపిన ప్రజాగాయకుడు గద్దర్ - మాదిగ పోరాట సమితి అధ్యక్షుడు మంద క్రిష్ణ మాదిగలపై ప్రజాసంఘాల నుంచి - కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గద్దర్ పై కాల్పులు జరిపించారని చెబుతున్న చంద్రబాబు నాయుడితో సఖ‌్యంగా ఉండడమే కాక - కౌగిలించుకోవడం వంటి చర్యలకు పాల్పడిన గద్దర్‌ ను ప్రజాసంఘాల వారు ప్రశ్నిస్తున్నారు. విప్లవ పోరాటంలో పాల్గొనేలా వేలాది మంది యువతీ - యువకులను ఉత్తేజపరచి వారిని నక్సలైట్లుగా మారేందుకు పరోక్షంగా ప్రభావితం చేసిన గద్దర్ నేడు ప్రజాకూటమికి ఎలా మద్దతు పలుకుతారంటూ ప్రశ్నిస్తున్నారు. సమైఖ్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేలాది మంది విప్లవకారులను ఎన్‌ కౌంటర్ పేరిట హతమార్చారని - అలాంటి చంద్రబాబు నాయుడితో గద్దర్ ఎలా కలుస్తారని ప్రశ్నిస్తున్నారు. " గద్దర్ ప్రజాకూటమి సభలో చంద్రబాబు నాయుడు - కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలను హత్తుకున్న తీరు చూస్తే అమరుల కుటుంబాల కళ్లల్లో కన్నీళ్లు ఆగడం లేదు" అని రాజకీయ విశ్లేషకుడు - సీనియర్ జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు. గద్దర్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే సమాజంలో మెలిగే మనిషి కాదని - ఆయనను తెలుగు ప్రజలు ఆ మాట కొస్తే దేశ ప్రజలు ప్రజా యుద్ధ నౌకగా కీర్తించారని అంటున్నారు. అలాంటి గద్దర్ ఇలా కనిపించడాన్ని తెలుగు వారు జీర్ణం చేసుకోలేకపోతున్నారని అంటున్నారు.

ఇక మాదిగలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన మంద క్రిష్ణ మాదిగ సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుపై యుద్ధం చేసారని - అలాంటిది ఇప్పుడు ఇలా ప్రవర్తించడం దారుణమనే వాదనలు వస్తున్నాయి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమయంలో పాదయాత్ర చేస్తూ నారావారిపల్లి వెళ్లి చంద్రబాబునాయుడి తల్లి అమ్మణమ్మకు వినతి పత్రం ఇచ్చిన సంధర్బాన్ని గుర్తు చేస్తున్నారు. "నీ కుమారుడు ముఖ్యమంత్రి అయిన తల్లిగా మీ మాట వింటారని మా నమ్మకం. మాకు న్యాయం చేయమని మీరైనా చెప్పండమ్మా" అంటూ ఆనాడు చంద్రబాబు తల్లికి మంద క్రిష్ణ మాదిగ వినతి పత్రం ఇచ్చారు. ఆ రోజులు మరచిపోయి నేడు బహిరంగంగా బాబును హత్తుకోవడం మాదిగలలో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది అంటున్నారు.

"మా సమూహం హక్కులను మంద క్రిష్ణ మాదిగ ఎలా కాలరాస్తారు?" అని మాదిగలకు చెందిన కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రజాఉద్యమాలను అణచివేసిన చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం పై అటు గద్దర్‌ను, ఇటు మంద క్రిష్ణ మాదిగను ఆయా సంఘాల వారు నిలదీస్తున్నారు.