Begin typing your search above and press return to search.

ఫ్యాంటు చొక్కా వేసుకుంటే మార్పు వ‌స్తుంద‌ట‌

By:  Tupaki Desk   |   22 Aug 2017 8:37 AM GMT
ఫ్యాంటు చొక్కా వేసుకుంటే మార్పు వ‌స్తుంద‌ట‌
X
క‌వి.. గాయ‌కుడు.. ప్ర‌జా ఉద్య‌మ‌వేత్త‌.. ఇలా చెప్పుకుంటూ పోతే గ‌ద్ద‌ర్ గురించి చాలానే ప‌రిచ‌యం చేయాల్సి వ‌స్తుంది. అలాంటి గ‌ద్ద‌ర్ నోటి నుంచి వ‌చ్చిన తాజా ఫ్యాంటు.. చొక్కా సిద్ధాంతం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. మైండ్ బ్లాక్ అయ్యేలా షాకిస్తోంది. ప్ర‌జాయుద్ధ నౌక‌గా అభిమానంగా పిలుచుకునే ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన తాజా మాట‌లు సంచ‌ల‌నంగా మారాయి.

స‌మాజంలో మార్పు కోసం ఇలా చేయేడేంద‌న్న సందేహంతో పాటు.. అర్థం కాన‌ట్లుగా ముఖానికి క్వ‌శ్చ‌న్ మార్క్ పెట్టుకునేలా గ‌ద్ద‌ర్ మాట‌లు ఉండ‌టం గ‌మనార్హం. వాస్త‌వానికి గ‌ద్ద‌ర్ తీరు మొద‌ట్నించి కాస్త భిన్నంగానే ఉంటుంద‌న్న విమ‌ర్శ ఉంది. ఆయ‌న్ను అభిమానించే వారెంద‌రో.. ఆయ‌న తీరును త‌ప్పు ప‌ట్టే వారూ చాలా మందే ఉంటారు. గొంగ‌ళి.. పంచె.. గ‌డ్డం.. తైల సంస్కారం లేని జ‌ట్టుతో ఒక సామాన్యుడిగా ఉండే గ‌ద్ద‌ర్ కు భిన్నంగా ఆయ‌న ఉండే ఇల్లు ఉంటుంద‌న్న మాట తెలిసిందే.

గ‌ద్ద‌ర్ అన్న వెంట‌నే మ‌రుక్ష‌ణం ఆయ‌న రూపం ప్ర‌తి తెలుగువాడి మ‌నోనేత్రం ముందు క‌ద‌లాడుతుంది. గ‌ద్ద‌ర్‌ ను గుర్తు తెచ్చుకోగానే.. ఆయ‌నో మావోల సానుభూతిప‌రుడిగా.. విప్ల‌వోద్య‌మ నాయుడిగా.. న‌క్స‌లైట్ల ఆరాధ‌కుడిగా గుర్తుకు వ‌స్తారు. అలాంటి ఆయ‌న ఫ్యాంటు.. చొక్కా వేసుకొని రావ‌టమే ఒక హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే.. ఆ మ‌ధ్య‌న కొన్నిసార్లు ఆయ‌న‌లోని మార్పు ఆయ‌న వ‌స్త్ర‌ధార‌ణ స్ప‌ష్టం చేసింది. తాజాగా ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన మాట‌ల‌తో ప‌లువురి నోట మాట రాకుండా చేసిందని చెప్పాలి.

స‌మాజంలోనూ.. అణ‌గారిన వ‌ర్గాల్లో మార్పు కోసం ద‌శబ్దాల త‌ర‌బ‌డి ప్ర‌య‌త్నిస్తున్న వారి త‌ర‌ఫున పోరాడుతున్న గ‌ద్ద‌ర్ తాజాగా ఫ్యాంటు.. చొక్కా.. టై క‌ట్టుకొని ఒక స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. గ‌తంలోనూ ఇదే తీరులో గ‌ద్ద‌ర్ రావ‌టంతో ఎవ‌రూ ఆశ్చ‌ర్య‌పోలేదు. మారిన ఆయ‌న వ‌స్త్ర‌ధార‌ణ‌కు భిన్నంగా ఆయ‌న మాట‌లు ఉండ‌టం విశేషంగా చెప్పాలి. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అన్యాయం జ‌రుగుతూనే ఉంద‌ని.. వారికి న్యాయం జ‌రిగేలా ప్ర‌భుత్వాలు కృషి చేయ‌లేద‌న్న గ‌ద్ద‌ర్‌.. ప్ర‌జ‌ల్లో మార్పు రాలేద‌న్నారు. త‌న నుంచే మార్పు జ‌ర‌గాల‌న్న అభిప్రాయంతోనే తాను ఫ్యాంటు.. ష‌ర్ట్ వేసుకున్న‌ట్లు చెప్పిన గ‌ద్ద‌ర్ మాట‌కు ఆ స‌మావేశానికి హాజ‌రైన వారి నోటి నుంచి మాట రాని ప‌రిస్థితి. స‌మాజ మార్పున‌కు ఫ్యాంటు.. చొక్కా.. టై వేసుకుంటే స‌రిపోయేదానికి.. మావోలు తుపాకీలు ప‌ట్టుకొని అడ‌వుల్లో తిరిగే కంటే.. చ‌క్క‌గా సూటు.. బూటు వేసుకుంటే స‌రిపోయేది క‌దా?