Begin typing your search above and press return to search.

కొత్త పార్టీ రాగాన్నిపాడుతూ..కేసీఆర్ ను తిట్టేస్తూ

By:  Tupaki Desk   |   20 April 2017 4:28 AM GMT
కొత్త పార్టీ రాగాన్నిపాడుతూ..కేసీఆర్ ను తిట్టేస్తూ
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న ప‌ట్ల తానెంత అసంతృప్తితో ఉన్నాన‌న్న విష‌యాన్ని ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ త‌న మాట‌ల‌తో సూటిగా చెప్పేశారు. త్వ‌ర‌లో కొత్త రాజ‌కీయ పార్టీని వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని చెప్పేసిన ఆయ‌న‌.. కేసీఆర్ స‌ర్కారుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల్ని సంధించారు. మ‌హ‌నీయుల జ‌యంతి కార్య‌క్ర‌మం తెలంగాణ వ‌ర్సిటీ క్యాంప‌స్ లో జ‌రిగింది. దీనికి ముఖ్య అతిధిగా హాజ‌రైన గ‌ద్ద‌ర్ కొత్త నినాదాన్ని తెర మీద‌కు తీసుకొచ్చారు. త్యాగ్యాలు మావే.. పాల‌న మాదేన‌న్న నినాదంతో ముందుకు వెళ్లాల‌న్న ఆయ‌న‌.. తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన బిడ్డ‌ల‌కు రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాత ఎలాంటి ప్ర‌యోజ‌నం ద‌క్క‌లేద‌న్న ఆయ‌న‌.. తెలంగాణ వ‌చ్చింది.. మ‌న‌కేం వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించుకోవాల‌నటం గ‌మ‌నార్హం.

నాడు రాషట్ర సాధ‌న కోసం ఉరికినోళ్లు ఎల్ల‌క‌ల్ల ప‌డ్డార‌ని.. ఉర‌క‌నోళ్లు ప‌ద‌వులు సాధించారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేయ‌టం ద్వారా జంప్ జిలానీలు.. ఉద్య‌మంలో పాల్గొన‌ని వారు తెలంగాణ స‌ర్కారులో ఎంత కీల‌క భూమిక పోషిస్తున్నార‌న్న విష‌యాన్ని చెప్పేశారు. త్వ‌ర‌లో త్యాగాలు చేసిన వారంతా ఏక‌మ‌వుతార‌ని.. త్యాగాల తెలంగాణ త‌ర‌హా పార్టీ ఏర్ప‌డుతుంద‌న్న విష‌యాన్ని చెప్పేశారు. తెలంగాణ ఉద్య‌మం కోసం ఇంజ‌నీరింగ్ చ‌దువును వ‌దిలేసి పోరాటంలోకి వ‌చ్చాన‌ని.. త‌న త‌ల్లి క‌న్నీరుపెట్టినా వినిపించుకోలేద‌న్న ఆయ‌న ప్ర‌జా ఉద్య‌మం పేరిట జెండాలు చేప‌ట్టాన‌ని.. ప్ర‌స్తుతం శ‌రీరంలో ఆరు బుల్లెట్ల‌తో కాలం గ‌డుపుతున్న విష‌యాన్ని గుర్తు చేశారు. తాను అన్ని జెండాల్ని వ‌దిలేసి పంచ‌శీల జెండాను చేత‌ప‌ట్టిన విష‌యాన్ని ప్ర‌స్తావించిన ఆయ‌న‌.. అంబేడ్క‌ర్‌ ను అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నారు.

టీఆర్ ఎస్ ఎంపీలు ముగ్గురే పార్ల‌మెంటుకు ప్రాతినిధ్యం వ‌హించినా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చ‌ర్చ సాగిన వేళ‌ల‌లో.. టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ క‌నీసం పార్ల‌మెంటుకు హాజ‌రు కాలేద‌న్నారు. తెలంగాణ‌లో పాల‌న పై నుంచి సాగ‌టంతో త్యాగాలు చేసిన వారికి.. కిందిస్థాయి వర్గాల వారికి ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌టం లేద‌న్నారు. మొత్తంగా చూస్తే కేసీఆర్ పాల‌న మీద తానెంత అసంతృప్తిగా ఉన్నాన‌న్న విష‌యాన్ని చెప్పేయ‌ట‌మే కాదు.. రాజ‌కీయంగా ఆయ‌న్ను ఎదుర్కొనేందుకు కొత్త శ‌క్తుల‌న్నీ క‌ల‌వ‌నున్నాయ‌న్న విష‌యాన్ని త‌న తాజా మాట‌ల‌తోగ‌ద్ద‌ర్ స్ప‌ష్టం చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రీ కొత్త పార్టీ రాగాన్ని కేసీఆర్ ఎంత‌లా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/