Begin typing your search above and press return to search.

గద్దర్ గారూ... ఎక్కడున్నారు సారూ !

By:  Tupaki Desk   |   29 Dec 2018 4:34 AM GMT
గద్దర్ గారూ... ఎక్కడున్నారు సారూ !
X
ఆయన ప్రజాయుద్ద నౌక... ఆయన విప్లవ గాయ‌కుడు... కొన్ని వేలమందిని వామపక్ష రాజకీయాల వైపు మళ్లించిన కళాకారుడు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందంటూ తన పాటతో ప్రచారం చేసిన వాడు. ఆయనే గద్దర్ గా పేరున్న విఠల్ రావు. మావోయిస్టు పార్టీగా మారిన పీపుల్ వార్ ఆవిర్భావం నుంచి ఆయన సానుభూతిపరుడు. వామపక్ష రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సమైక్య రాష్ట్రంలో గద్దర్ పై కాల్పులు కూడా జరిగాయి. చేతిలో కర్ర - ఆ కర్ర చివరిలో ఓ ఎర్రటి తువ్వాలు - భుజంపై కంబళితో ఆహార్యంతోనే ఆకట్టుకునే గద్దర్ తన పంథా మార్చుకున్నారు.

గత రెండు సంవత్సరాలుగా గద్దర్ తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు... ఇటీవల జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానంటూ ప్రచారం కూడా చేశారు. అంతే కాదు.... ఓటు రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ ప్రచారం చేసిన గద్దర్ తానే స్వయంగా ఓటు నమోదు చేయించుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రజాకూటమి కట్టిన కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - సిపిఐలను గెలిపించాలంటూ ప్రచారం చేశారు. ప్రచార వేదికలపై రాహుల్ గాంధీ - చంద్రబాబు నాయుడులను కౌగలించుకున్నారు.

తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. ప్రజాకూటమి దారుణాతి దారుణంగా ఓటమి పాలైంది. ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు రోజు వరకూ తెలంగాణలో హడావుడి చేసిన గద్దర్ ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఫలితాల ముందు వరకూ తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా విలేకరుల సమావేశాలు పెట్టిన గద్దర్... ఫలితాల అనంతరం మాత్రం కనిపించడం లేదు. అంతేనా... ఎక్కడా వినపడలేదు కూడా. ఎన్నికల ముందు హడావుడి చేసిన గద్దర్ ఇప్పుడు ఎక్కడున్నావంటూ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఎన్నికల వేదికపై తనను కాల్చిన చంద్రబాబు నాయుడ్ని అక్కున చేర్చుకున్న గద్దర్ ఎన్నికల ఫలితాలతో అవాక్కాయారా.... అని వారు ప్రశ్నిస్తున్నారు. గద్దర్ గారూ... ఎక్కడున్నారు సారూ అని వారు వెతుకులాడుతున్నారు.