Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై హైకోర్టుకు గ‌ద్ద‌ర్‌...రాహుల్‌ను అందుకే క‌లిశార‌ట‌!

By:  Tupaki Desk   |   9 May 2022 7:30 AM GMT
కేసీఆర్ పై హైకోర్టుకు గ‌ద్ద‌ర్‌...రాహుల్‌ను అందుకే క‌లిశార‌ట‌!
X
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్ర‌ముఖ గాయ‌కుడు, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు గ‌ద్ద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో భూ సమస్యల‌ పరిష్కారం కోసం ప్రభుత్వంపై మరో ఉద్యమం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రజా గాయకుడు గద్దర్ వెల్లడించారు. అవ‌స‌ర‌మైతే హైకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు గ‌ద్ద‌ర్ ప్ర‌క‌టించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ సాగిస్తున్న పాలనపై పలు విషయాలను చర్చించానన్నారు. ప్రధానంగా రైతుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన విషయాలను వివరించగా రాహుల్ గాంధీ సైతం సానుకూలంగా స్పందించారనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో పేద రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్న గద్ద‌ర్‌ ధరణి ఎత్తివేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు తాను మద్దతు ప్రకటిస్తానన్నారు. ధరణితో తలెత్తుతున్న ఇబ్బందులు సైతం రాహుల్ గాంధీకి వెల్ల‌డించిన‌ట్లు గద్ద‌ర్ తెలిపారు.

ఆదివారం మదర్స్ డే సందర్భంగా తన సొంతూరైన మెదక్ జిల్లా తూప్రాన్ లో తన తల్లి లక్ష్మమ్మ సమాధి వద్ద ఆయన పూల‌మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తూప్రాన్ లో తన తల్లి లక్ష్మమ్మ పేరుతో పాటల స్కూల్ ఏర్పాటు చేస్తానని, దానికి భూమిని కేటాయించాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా భూమి కేటాయించలేదని గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు.

తూప్రాన్ లో ఉన్న తన ఎకరా పొలంలో నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వెళుతుందని తన ఎకరా పొలం బదులుగా మరోచోట ఆ భూమిని ఇచ్చిన తర్వాతనే పనులు చేపట్టేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. స్థలం కేటాయించాలని గత రెండేళ్లుగా జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశానని గుర్తుచేశారు.

ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు పొలం సాగు చేసి తనని ఉన్నత విద్య చదివించేందుకు ఎంతో కష్టపడ్డారని చెప్పారు.తనకు భూమికి బదులుగా భూమి ఇచ్చే వరకు పనులు జరగనివ్వనని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 135 ఎకరాల భూమి కోల్పోతుండటంతో రైతులు అందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారని గద్దర్ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఉన్న ఒక ఎకరం పట్టా భూముల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ప్రభుత్వం భూమికి భూమికి ఇచ్చే వరకు కాళేశ్వరం పనులు జరగకుండా చూస్తానని గద్దర్ అన్నారు. అవసరం అయితే నా పొలానికి కంచేవేసుకుని అక్కడే కూర్చుంటానని గద్దర్ తేల్చిచెప్పారు. ఈవిషయంలో రెండు రోజుల్లో హైకోర్టు కోర్టులో కేసు వేస్తానని తెలిపారు.