Begin typing your search above and press return to search.

గ‌ద్ద‌ర్ ప‌వ‌న్ వైపా..కాంగ్రెస్ వైపా?

By:  Tupaki Desk   |   11 Sep 2018 2:43 PM GMT
గ‌ద్ద‌ర్ ప‌వ‌న్ వైపా..కాంగ్రెస్ వైపా?
X
ప్రజా యుద్ధనౌక - గాయ‌కుడు గ్ద‌ద‌ర్ ఇప్పుడు వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. గద్దర్‌ ఇటీవలే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పోటీచేస్తా.. అవసరమైతే ముఖ్యమంత్రి కూడా అవుతా అని ప్రకటించారు. ఈ వార్త సంచ‌ల‌నం సృష్టించింది. స‌హ‌జంగానే...ఆయ‌న ఏ పార్టీ నుంచి బ‌రిలో దిగ‌నున్నారు...ఎలాంటి స్థానాన్ని అధిరోహించ‌నున్నారు? నిజంగానే సీఎం అవుతారా? అనే సందేహాలు తెర‌మీద‌కు వ‌స్తాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే...రాబోయే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి కానున్నారట‌. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీతో దోస్తీ న‌డిపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న వ్యూహం అంతుచిక్క‌డం లేదు.

టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాబోయే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలో దిగుతుండ‌గా....కాంగ్రెస్ సార‌థ్యంలో టీడీపీ - టీజేఎస్‌ - సీపీఐ ఇత‌ర చిన్నాచిత‌క పార్టీలు మ‌హాకూట‌మిగా పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇక వామ‌ప‌క్షాల్లోని మ‌రోపార్టీ అయిన సీపీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన‌తో జ‌ట్టుక‌ట్టేందుకు ఆస‌క్తి చూపిస్తోంది. ఈ మేర‌కు చ‌ర్చ‌లు దాదాపు పూర్త‌య్యాయి. అయితే ఈ పొత్తుల ప‌ర్వంలో రెండు పార్టీలు కీల‌క ఎత్తుగ‌డ‌కు శ్రీ‌కారం చుట్టిన‌ట్లు తెలుస్తోంది. అదే గ‌ద్ద‌ర్‌ ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం.

వాస్త‌వానికి తెలంగాణలో జ‌న‌సేన‌కు మూడు నుంచి ఐదు నియోజ‌క‌వ‌ర్గాల లోపే...ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసే శ‌క్తి ఉంది. ఇక సీపీఎం విష‌యానికి వ‌స్తే..గతంలో ఆ పార్టీ అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ....ఇటీవ‌ల నామ్‌ కేవాస్తీగా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీలు దోస్తీ క‌ట్టినా...రాబోయే ఎన్నిక‌పై ఎంత మేర‌కు ప్ర‌భావం చూపుతుందో అనేది ఎంద‌రిలోనో ఉన్న సందేహం. ఈ నేప‌థ్యంలో త‌మ వైపు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించే ఎత్తుగ‌డ‌లో భాగంగా గ‌ద్ద‌ర్ పేరును సీఎంగా ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు చెప్తున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న కోరిక‌ను - సిద్ధాంతాన్ని సైతం గౌర‌వించిన‌ట్లు అవుతుంద‌ని అంటున్నారు.

ఈ రెండుప‌క్షాల ఎత్తుగ‌డ‌లు ఇలా ఉండ‌గా...గ‌ద్ద‌ర్ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌ల్లుభ‌ట్టివిక్ర‌మార్క‌తో భేటీ అవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఓవైపు ఆయ‌న‌పై సీపీఎం - జ‌న‌సేన ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న స‌మ‌యంలో...ఆయ‌న ఈ భేటీ చ‌ర్చ‌నీయాంశంగానే కాదు...సీపీఎం-జ‌న‌సేన కూట‌మికి ఆందోళ‌న క‌రంగా కూడా మారింద‌ని చెప్తున్నారు.