Begin typing your search above and press return to search.

పోయి పోయి కేఏ పాల్ పార్టీ నుంచి పోటీ ఏంటి 'గద్దర్' సాబ్?

By:  Tupaki Desk   |   6 Oct 2022 6:55 AM GMT
పోయి పోయి కేఏ పాల్ పార్టీ నుంచి పోటీ ఏంటి గద్దర్ సాబ్?
X
తెలంగాణ ఉద్యమంలో అలుపెరగకుండా పోరాడిన ఉద్యమయోధుడు గద్దర్. ఈయనను ప్రజా యుద్ధనౌక అని కూడా అంటారు. అయితే తెలంగాణ కోసం.. కమ్యూనిజం, మావోయిజం కోసం అలుపెరగకుండా పోటీచేసిన గద్దర్ ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం పోటీచేయలేదు. ప్రజల్లో చాలా ఫెయిత్ ఉన్నప్పటికీ ఆయన ఎన్నికల కార్యక్షేత్రంలో దిగలేదు. ఇక ఏ పార్టీలోనూ అధికారికంగా చేరలేదు. కానీ కొన్ని పార్టీలకు గతంలో మద్దతు ఇచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు సందర్భానుసారం అక్కున చేర్చుకున్నాడు.

గద్దర్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడానికి రెడీ కావడం ఆసక్తి రేపుతోంది. నల్గొండ జిల్లా మునుగోడు స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నికల్లో గద్దర్ బరిలోకి దిగడం ఆసక్తి రేపుతోంది. కాకపోతే అందరినీ ఆశ్చర్యపరిచే అంశం ఏందంటే.. ఆయన పోటీచేసిది.. ఏ టీఆర్ఎస్ నో.. కాంగ్రెస్ నుంచో కాదు.. అందరూ ఊహించని మన పొలిటికల్ కమెడియన్ కేఏ పాల్ 'ప్రజాశాంతి' పార్టీ నుంచి.. ప్రపంచ శాంతి కోసం అంటూ పాటుపడుతూ టూరిస్ట్ లా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి రాజకీయ కామెడీ చేసి వెళ్లిపోయే కేఏ పాల్ పార్టీ నుంచి గద్దర్ పోటీచేయడమే అనూహ్యం. ఆయన్ని ఎలా నమ్మాడో.. ఎలా పోటీచేస్తున్నాడో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

కవి, గాయకుడు గద్దర్ కు ప్రజల మనిషిగా అనన్యమైన గుర్తింపు ఉండేది. వామపక్ష భావజాల ఉద్యమ పోరాటాలలో కీలకమైన వ్యక్తిగా మెలిగి తన పాటలతో ప్రజలను ఉర్రూతలూగించిన గద్దర్ తనకు ఎంత ఆదరణ ఉన్నప్పటికీ ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల వైపు చూడలేదు. అలాగని రాజకీయ పార్టీల మీద తన వాగ్భాణాలను సంధించడం మానలేదు.

రాజకీయాల మీద ఆయనకు ఆసక్తిలేదని అనుకోవడానికి కూడా లేదు. గత ఎన్నికల్లోనే గజ్వేల్ లో కేసీఆర్ పోటీచేయాలని ముచ్చటపడ్డారు కూడా. ఎట్టకేలకు ఊరు పేరు లేని.. తెలంగాణ ప్రజలలో ఆదరణకు ఏమాత్రం ఠికానా లేని కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ తరుఫున ఆయన ఎన్నికల బరిలో దిగుతూ ఉండడమే ఆశ్చర్య కలిగిస్తోంది.

ఇక స్వతహాగా కమ్యూనిస్టు అయిన పవన్ కళ్యాణ్ తాను జనసేన పార్టీని స్థాపించినప్పుడు గద్దర్ ను పలుమార్లు కలిశారు. గద్దర్ మీద తనకు విపరీతమైన గౌరవాభిమానాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ ఇప్పటికీ బహిరంగ వేదికల మీద ప్రసంగాలలో ప్రస్తావిస్తుంటారు. గద్దర్ వస్తే పువ్వుల్లో పెట్టుకొని పవన్ చూసుకొని టికెట్ ఇస్తాడు. తెలంగాణలో కీలక బాధ్యతలు అప్పగిస్తారు..

అలాంటి అభిమానించే పవన్ ను కాదని గద్దర్ ఇంత అనుభవం ఉండి.. తెలంగాణ రాజకీయాలను చూసి మాట మీద నిలబడకుండా రాజకీయ గారెడీ చేసే కేఏ పాల్ ను నమ్మడమే ఒక వింత.. ఆయనను నమ్మి ఇలా ఆయన పార్టీ తరుఫున పోటీచేయడం ఏంటీ సామీ అని అందరూ కామెంట్ చేస్తున్న పరిస్థితి తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.