Begin typing your search above and press return to search.

కోదండం మాస్టారి కొత్త పార్టీ ప్లాన్ ఇదే

By:  Tupaki Desk   |   25 April 2017 8:53 AM GMT
కోదండం మాస్టారి కొత్త పార్టీ ప్లాన్ ఇదే
X
తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారా? తెరాస పట్ల అసంతృప్తితో ఉన్న వివిధ వర్గాలతో ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారా? ఇందులో మొద‌టి ద‌శ పూర్త‌యిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. వివిధ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం 2001లో టీఆర్ ఎస్ ఏర్పడినప్పుడు కీలకపాత్ర వహించి ప్రధాన కార్యదర్శి పదవి నిర్వహించిన గాదె ఇన్నయ్య, కోదండరాం కొత్త పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఇన్న‌య్య వెల్ల‌డించారు. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి నుంచి 45 రోజుల పాటు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ సెప్టెంబర్‌ లో ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో పార్టీ ఏర్పడుతుందని గాదె ఇన్నయ్య తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 30న హైదరాబాద్‌ లో సన్నాహక కమిటీ సమావేశం జరుగుతుందని వెల్ల‌డించారు. రెండు నెలల పాటు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం మొత్తం 31 జిల్లాల నుంచి సన్నాహక కమిటీ సమావేశానికి ప్రతినిధులను ఆహ్వానించారు. ఇద్దరి నుంచి ఐదుగురి వరకు ఒక్కో జిల్లానుంచి హాజరు కావాలని కోరారు. సన్నాహక కమిటీ సమావేశం అనంతరం పార్టీ ప్రణాళిక, ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తారు. అదేవిధంగా పార్టీ ఏవిధంగా ఉండాలో నివేదిక రూపొందిస్తారు. వార్డుస్థాయి నుంచి ఎంపీ స్థానం వరకు పోటీ చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని ఇన్నయ్య చెప్పారు. రెండునెలల పాటు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహించి, రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశానికి కారణాలను వివరిస్తామన్నారు. సెప్టెంబర్‌ లో పార్టీని ప్రకటిస్తామ‌ని, అప్పటివరకు కోదండరాం జేఏఏసీ కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు.

పార్టీ ఏర్పాటుకు సన్నాహక కమిటీ ఒకవైపు ఏర్పాట్లు చేస్తుండగానే, మరోవైపు కోదండరాం జేఏసీ కార్యకలాపాలు కొనసాగిస్తారని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ లో పార్టీ ఏర్పాటు నిర్ణయం తరువాత కోదండరాం జేఏసీ నుంచి బయటకు వచ్చి పార్టీకి నాయకత్వం వహిస్తారని వెల్ల‌డించారు. సన్నాహక కమిటీ సమావేశంలో జేఏసీలోని నాయకులు కూడా పాల్గొంటారు. తెలంగాణ కోసం అన్ని వర్గాలు ఉద్యమించాయని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ వైఖరి వల్ల ఉద్యమంలో పాల్గొన్న వర్గాలు కేసీఆర్‌ కు దూరం అవుతున్నాయని, ఈ వర్గాలను కొత్తపార్టీలోకి ఆహ్వానిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రధానంగా తెరాస అసంతృప్తి వాదులపై దృష్టి సారించారని స‌మాచారం. ప్రజల స్పందన, అసంతృప్తివాదుల నుంచి వచ్చిన స్పందన చూసి ఏవిధంగా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకునేంద‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/