Begin typing your search above and press return to search.

2.50ల‌క్ష‌ల కోట్ల అప్పు లెక్కేంది బాబు?

By:  Tupaki Desk   |   28 Aug 2018 5:14 AM GMT
2.50ల‌క్ష‌ల కోట్ల అప్పు లెక్కేంది బాబు?
X
త‌న ప్ర‌భుత్వం గురించి గొప్ప‌లు చెప్పుకునే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఒకే ఒక్క ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధాన్ని అడుగుతున్న ప‌రిస్థితి. నాలుగున్న‌రేళ్ల క్రితం ఎన్నిక‌లు ముగిసే నాటికి ఏపీ ప్ర‌భుత్వానికి ఉన్న అప్పు రూ.90వేల కోట్లు. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల బాబు పాల‌నలో ఏపీ అప్పు రూ.2.50ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంది.

ఇంత భారీ అప్పు ఎలా అయ్యింది? తెచ్చిన అప్పుతో చంద్ర‌బాబు ఏం చేశారు? అన్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత క‌మ్ ఎమ్మెల్యే శ్రీ‌కాంత్ రెడ్డి ఇదే విష‌యాన్ని సూటిగా ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబు దుబారాపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌న్న డిమాండ్ చేసిన ఆయ‌న‌.. ఏపీకి బాబు సీఎమ్మా? రియ‌ల్ ఎస్టేట్ ..స్టాక్ మార్కెట్ ఏజెంటా? అని ప్ర‌శ్నించారు. గ‌తంలో తొమ్మిదిన్న‌రేళ్లు ఏపీకి ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన స‌మ‌యంలో రాష్ట్రాన్ని అప్పుల‌తో అస్త‌వ్య‌స్తం చేశార‌ని.. ఇప్పుడు మ‌ళ్లీ అదే తీరుతో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ శ్రీ‌కాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

రాజ‌ధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ.3వేల కోట్ల‌తో తాత్కాలిక భ‌వ‌నాలు క‌ట్టిన‌ట్లు చెప్పే చంద్ర‌బాబు.. పోల‌వ‌రం నిర్మాణానికి రాష్ట్రం ఖ‌ర్చు చేసిన రూ.9వేల‌కోట్ల‌నుకేంద్రం ఇచ్చామ‌ని చెబుతోంద‌ని.. అలాంట‌ప్పుడు రూ.1.5ల‌క్ష‌ల కోట్లను ఎలా ఖ‌ర్చు పెట్టారో బాబు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. హైద‌రాబాద్‌లోని జీహెచ్ఎంసీ రూ.200 కోట్లు తొమ్మిది శాతం వడ్డీకి రుణాన్ని తీసుకుంటే.. బాబు మాత్రం ఎక్కువ వడ్డీని ఎందుకు చెల్లిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.

బాండ్లు తీసుకున్న వారి వివ‌రాల్ని బాబు ఎందుకు వెల్ల‌డించ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. బాబు పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ .. ఒక ఎంపీ.. వేల కోట్ల రూపాయిల్ని బ్యాంకుల‌కు ఎగ‌నామం పెట్టార‌ని.. అలాంటి చ‌రిత్ర ఉన్న వారిని బాబు త‌న చుట్టూ పెట్టుకోవ‌టంలో ఉద్దేశం ఏమిటి? అని ప్ర‌శ్నించారు. రాజ‌ధాని నిర్మాణానికి రూ4వేల కోట్ల‌కు పైగా బాండ్స్ ద్వారా నిధులు సేక‌రిస్తామ‌ని చెబుతూ.. రూ.48వేల కోట్ల‌కు టెండ‌ర్లు పిల‌వ‌టంలో అంత‌ర్యం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వేళ‌.. ఇప్పుడు హ‌డావుడిగా భారీ ఎత్తున టెండ‌ర్లు పిల‌వ‌టానికి కార‌ణం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఓట‌మి ప‌క్కా అని తేలిపోవ‌టంతో.. కాంట్రాక్ట‌ర్ల నుంచి క‌మిష‌న్లు తీసుకునేందుకే భారీ ఎత్తున టెండ‌ర్ల‌ను పిల‌వ‌టంతో అంత‌ర్యంగా ఆయ‌న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. కేవ‌లం నాలుగున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో రూ.1.50ల‌క్ష‌ల కోట్ల మొత్తాన్ని అప్పుగా చేయ‌టం ఏపీ భ‌విష్య‌త్తుకు ఇబ్బందిక‌రంగా మారుతుంద‌న‌టంలో మాత్రం సందేహం లేద‌ని చెప్పాలి.