Begin typing your search above and press return to search.

అలా చేస్తే.. స‌భ‌కు వ‌స్తామ‌న్న జ‌గ‌న్ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   9 Nov 2017 9:26 AM GMT
అలా చేస్తే.. స‌భ‌కు వ‌స్తామ‌న్న జ‌గ‌న్ ఎమ్మెల్యే
X
ఏపీ విపక్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న పాద‌యాత్ర అధికార‌ప‌క్షంలో గుబులు రేపుతోంది. 2004 ముందు నాటి ప‌రిస్థితులు ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌న్న సంకేతాల‌తో తెలుగు త‌మ్ముళ్లు విల‌విల‌లాడుతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను త‌ప్పుదారి ప‌ట్టించేందుకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్నింటిని బ‌య‌ట‌కు తీస్తున్న వారు.. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా విప‌క్షం స‌భ‌కు హాజ‌రుకాక‌పోవ‌టంపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు.

అసెంబ్లీకి విప‌క్షం రాకుంటే స‌భ న‌డ‌వ‌దా? ఎలా న‌డుస్తుందో చూపిద్దాం.. అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం పార్టీ నేత‌ల‌కు చెబుతున్నారు. ఇక‌.. ఉండ‌వ‌ల్లి లాంటి నేత‌లు సైతం అసెంబ్లీ స‌మావేశాల‌కు విప‌క్షం హాజ‌రు కాక‌పోవ‌టం త‌ప్పు అని.. పెద్ద పొర‌పాటుగా అభివ‌ర్ణిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు రియాక్ట్ అయ్యారు. స‌భ‌కు ఎందుకు హాజ‌రు కాక‌పోతున్నామ‌న్న విష‌యాన్ని వారు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. స‌భ‌కు రావ‌టానికి తాము రెఢీ అని చెబుతూనే అధికార‌ప‌క్షానికి చెమ‌ట‌లు ప‌ట్టించే మాట‌ను చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ స్పీక‌ర్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.. సీనియ‌ర్ నేత గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి వెల్ల‌డించారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల‌పై అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు తీరు దారుణంగా ఉందంటూ .స్పీక‌ర్ బాధ్య‌తారహితంగా వ్య‌వ‌హ‌రించ‌టం స‌రికాదన్నారు. త‌మ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు బ‌హిష్క‌రించిన స‌మ‌యంలో తన‌ను ప్ర‌శ్నించే అధికారం కోర్టుల‌కు లేద‌ని గుర్తు చేసిన స్పీక‌ర్‌.. ఫిరాయింపుదారుల‌ను అన‌ర్హులుగా ప్ర‌క‌టించాల‌న్న విష‌యంలో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు.

ఈ కార‌ణంతోనే తాము అసెంబ్లీ స‌మావేశాల్ని బ‌హిష్క‌రిస్తున్న‌ట్లుగా చెప్పారు. అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కావ‌టానికి 20 రోజుల స‌మ‌యం ఉంద‌ని.. పార్టీ మారిన వారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటే అసెంబ్లీకి హాజ‌ర‌వుతామ‌న్న ఆయ‌న‌.. రాజ్యాంగాన్నిస్పీక‌ర్ గౌర‌విస్తే స‌భ‌కు వ‌స్తామ‌న్నారు. ప్ర‌తిపక్ష ఎమ్మెల్యేల‌కు కేబినెట్ లో చోటు క‌ల్పించ‌టం దారుణ‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు. శ్రీ‌కాంత్ రెడ్డి మాట‌లు ఏపీ అధికార‌ప‌క్షానికి సంక‌టంగా మార‌తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ స‌భ‌కు హాజ‌రుకామ‌న్న నిర్ణ‌యాన్ని చూపిస్తూ విప‌క్ష నేత‌లపై విరుచుకుప‌డుతున్న తెలుగు త‌మ్ముళ్ల నోటికి శ్రీ‌కాంత్ రెడ్డి స్పీడ్ బ్రేక‌ర్లు వేసిన‌ట్లుగా చెప్పాలి. ఫిరాయింపుదారుల‌పై స్పీక‌ర్ నిర్ణ‌యం తేల్చాల‌న్న దానిపై స్పీక‌ర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.