Begin typing your search above and press return to search.

విశ్రాంతి తీసుకోకుండా ఇదేం పని బాబు?: గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

By:  Tupaki Desk   |   9 April 2020 12:53 PM GMT
విశ్రాంతి తీసుకోకుండా ఇదేం పని బాబు?: గడికోట శ్రీకాంత్‌ రెడ్డి
X
స్వియ నిర్బంధంలో వున్న చంద్రబాబు విశ్రాంతి తీసుకోవాలే కానీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం తగదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు దుష్ప్రచారం చేయడంపై ఆయన నిప్పులు చెరిగారు. చంద్రబాబు తెలంగాణలో ఉంటూ..ఆంధ్రప్రదేశ్‌ ను కించపరిచేలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. గురువారం గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నివారణకు లాక్‌ డౌన్ - సోషల్‌ డిస్టెన్స్‌ ఒక్కటే మార్గమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. . కరోనా వ్యాప్తి నియంత్రణకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిరోజూ సమీక్షలు చేస్తున్నారన్నారు.

ప్రపంచమంతా కరోనా వైరస్‌ అల్లకల్లోలం సృష్టిస్తోందని.. లాక్‌ డౌన్‌ ను కొన్ని రోజులు పొడిగించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి సీఎం వైఎస్‌ జగన్‌ నిరంతరం ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉన్నాయని.. ప్రతి నియోజకవర్గంలో 200 పడకల క్వారంటైన్లు ఉన్నాయని పేర్కొన్నారు. క్వారంటైన్‌ లో ఒక్కరు కూడా లేరంటే ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు అర్థం చేసుకోవచ్చన్నారు. టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించామని.. మామిడి రైతుల కోసం కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వివరించారు. రేషన్‌ కార్డు లేని వారికి సైతం స్థానిక అధికారులతో విచారించి విపత్తు పరిహారం అందేలా చూస్తున్నామని శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు.