Begin typing your search above and press return to search.

తగ్గేదేలే : మోడీకి సవాల్ గా గడ్కరీ...?

By:  Tupaki Desk   |   24 Aug 2022 2:30 PM GMT
తగ్గేదేలే : మోడీకి సవాల్ గా గడ్కరీ...?
X
ఆయన జాతీయ రాజకీయాల్లో మోడీ కంటే సీనియర్. ఇంకా చెప్పాలీ అంటే బీజేపీ రాజకీయాల్లో కూడా సీనియర్. మోడీ కంటే ముందే అధికార పదవులు పార్టీ పదవులు ఎన్నో నిర్వహించిన అనుభవశాలి. ఆయనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఆయనను ఇటీవలనే బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారు. దాని మీద ఆయన ఏ రకంగా రియాక్ట్ అవుతారు అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే నితిన్ గడ్కరీ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా మోడీ సర్కార్ మీద తన బాణాలను మరోసారి ఎక్కుపెట్టారు. దానికి గానూ ఆయన ముంబైలో నాట్కోన్‌ 2022 ఈవెంట్‌ ను వేదికగా చేసుకున్నారు. భారత్ లో మౌలిక సదుపాయాల పరంగా ఎంతో ఉంది, ఎన్నో చేయవచ్చు. భారత్ అద్భుతమైన దేశం అని పేర్కొన్నారు. భారత్ ప్రగతి దారిన నడవాలీ అంటే చేయాల్సింది చాలా ఉంది అని అన్నారు.

అయితే భారత్ లో అద్భుతాలు సృష్టించడానికి ప్రభుత్వాలకు కూడా ఉత్సాహమన్నది ఉండాలని అన్నారు. సకాలంలో నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు ఉంటేనే ఇదంతా సాధ్యమని ఆయన అన్నారు. కీలకమైన నిర్ణయాల విషయంలో కూడా తీరని జాప్యం జరుగుతోంది అని గడ్కరీ అన్నారు. ప్రభుత్వాల తీరు మారకపోతే మాత్రం భారత్ లో అద్భుతాలు జరిగే అవకాశాలు లేవు అని గడ్కరీ చెప్పాల్సింది చెప్పేశారు.

మరి ప్రభుత్వాలు అని ఆయన జనరలైజ్ చేసి చెప్పినా ఎవరిని ఉద్దేశించి అన్నారు అన్నదే ఇక్కడ చర్చ. దేశంలో ఎనిమిదేళ్ళుగా మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ప్రభుత్వాల అలసత్యం, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం అంటూ గడ్కరీ బాణాలు వేసింది నేరుగా మోడీ మీదనేనా అన్న చర్చ అయితే వస్తోంది. అదే టైమ్ లో కేవలం ప్రకటనలు చేస్తే అభివృద్ధి జరగదు అని కూడా గడ్కరీ సెటైర్లు వేయడం కూడా నేరుగా మోడీ మాస్టార్ కే అని అంటున్నారు.

అంటే తనను బీజేపీలో కీలకమైన పదవి నుంచి తొలగించిన తరువాత గడ్కరీ ఇచ్చిన తొలి రిటార్ట్ గా దీన్ని భావించాలి. అయితే ఇది ఇక్కడితో ఆగిపోదు అని కూడా అంటున్నారు. గడ్కరీ పట్టుదల మనిషి. పైగా జనాదరణ ఉన్న వారు. పనిలేకుండా ఢిల్లీలో కూర్చుని పెద్దలకు భజన చేసే రకం అంతకంటే కాదు, తన సొంత నియోజకవర్గంలో ఆయన ఎక్కువ టైమ్ గడుపుతారు. ఆయన కరడు కట్టిన ఆరెస్సెస్ వాది.

ఇక బీజేపీలో ఆయన ఎక్కువగా గౌరవించేది అటల్ బిహారీ వాజ్ పేయి, అద్వానీ లాంటి వారిని, అలాగే బీజెపీ ఈ రోజున ఇలా ఉంది అంటే దీనదయాల్ ఉపాధ్యాయ వంటి వారి తోనే అని కూడా ఆయన నమ్ముతారు. బీజేపీ ఈ రోజున ఈ రకంగా వ్యక్తి పూజకు పరిమితమై కొందరి చేతులల్లో ఉండిపోవడం సీనియర్లకు అసలు గిట్టడంలేదు. అలాంటి సీనియర్లలో ముందు వరసలో ఉన్న గడ్కరీ కచ్చితంగా తన గొంతు విప్పుతూనే ఉంటారు అని అంటున్నారు. అంటే మోడీ మీద పోరుకు ఆయన ఎపుడూ సై అనే అంటారని తెలుస్తోంది. మరి దీని మీద మోడీ వైపు నుంచి ఎలా రియాక్షన్ ఉంటుందో చూడాలి.