Begin typing your search above and press return to search.

గ‌డ్క‌రీ మాట‌ల్లో ఏదో తేడా కొడుతున్న‌ట్లుందే మోడీషా?

By:  Tupaki Desk   |   28 Jan 2019 11:17 AM GMT
గ‌డ్క‌రీ మాట‌ల్లో ఏదో తేడా కొడుతున్న‌ట్లుందే మోడీషా?
X
తిరుగులేని అధికారం చేతిలో ఉన్న వేళ‌.. అలాంటి వారికి ఎదురెళ్లే ధైర్యం.. సాహ‌సం స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో క‌నిపించ‌ని ప‌రిస్థితి. అయితే.. అందుకు భిన్నంగా తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ప్ర‌ధాని మోడీపై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేసే స‌త్తాను ప్ర‌ద‌ర్శిస్తున్నారు కేంద్ర‌మంత్రి నితిన్ గడ్క‌రీ. ఈ మ‌ధ్య‌న వెల్ల‌డైన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌వ‌ర్లో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారాన్ని చేజార్చుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ అంశంపై స్పందించిన గ‌డ్క‌రీ.. గెలుపు ఓట‌ముల‌ను స‌మానంగా స్వీక‌రించే స‌త్తా పార్టీ నాయ‌కుల‌కు ఉండాలంటూ వేసిన చుర‌క అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా హామీల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. నెర‌వేర్చ‌ని హామీలు ఇస్తే నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు రాజ‌కీయంగా దెబ్బ కొడ‌తార‌ని వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. హామీల‌పై స్ప‌ష్ట‌త లేకుంటే ఎన్నిక‌ల్లో ఆ పార్టీల‌కు ప్ర‌జ‌లు ఓటు వేయ‌ర‌ని వ్యాఖ్యానించ‌టం క‌చ్ఛితంగా మోడీని ఉద్దేశించేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ముంబ‌యిలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నితిన్ గ‌డ్క‌రీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పెద్ద పెద్ద వాగ్దానాలు చేసే నాయ‌కులంటే ప్ర‌జ‌ల‌కు ఇష్ట‌మ‌ని.. కానీ.. ఆ హామీల్ని నెర‌వేర్చ‌కుంటే అదే ప్ర‌జ‌లు స‌ద‌రు నేత‌ల్ని దెబ్బ కొడ‌తార‌న్నారు. త‌న‌కు వ‌ర‌కూ తాను నెర‌వేర్చ‌గ‌లిగే హామీలను మాత్ర‌మే ఇస్తాన‌ని.. అలాంటి హామీల‌కే పార్టీలు ప‌రిమితం కావాలంటూ హిత‌వు ప‌లికారు. పైకి చూసిన‌ప్పుడు ఈ వ్యాఖ్య‌ల‌న్ని మామూలుగా ఉన్న‌ప్ప‌టికీ.. లోతు లెక్క‌ల్లోకి వెళితే తేడా కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్పాలి.

అదెలానంటే.. బీజేపీని వెనుక నుంచి ఆడించే అదృశ్య శ‌క్తిగా అభివ‌ర్ణించే సంఘ్ ప‌రివార్ కు తాజాగా మ‌హారాష్ట్ర రైతు నేత కిషోర్ తివారీ ఒక లేఖ రాస్తూ.. మోడీ స్థానంలో గ‌డ్క‌రీని నియ‌మించాల‌ని కోరారు. అదేమంత ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌నుకుంటే.. మ‌రో ప‌రిణామం చోటు చేసుకుంది. అదేమంటే.. బీజేపీ సీనియ‌ర్ నేత సంఘ్ ప్రియ గైత‌మ్ గ‌డ్క‌రీని ఉప ప్ర‌ధానిని చేయాల‌న్న వాద‌న‌ను వినిపించారు. ఇది స‌రిపోద‌న్న‌ట్లుగా తాజాగా జ‌రిగిన రిప‌బ్లిక్ డే్ వేడుక‌ల సంద‌ర్భంగా గ‌డ్క‌రీ ప‌క్క‌నే రాహుల్ సీటు ఉండ‌టం.. వారిద్ద‌రూ మాట్లాడుకోవ‌టం క‌నిపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మోడీ అంటే అస్స‌లు పొస‌గ‌ని ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ అధికార పార్టీకి చెందిన కేంద్ర‌మంత్రి గ‌డ్క‌రీ ప‌ని తీరును పొగిడేస్తున్న వైనం చూస్తుంటే మొత్తంగా ఏదో తేడా కొడుతుంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.