Begin typing your search above and press return to search.

రాజకీయం క్రికెట్ లాంటిదేనంటూ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   15 Nov 2019 7:29 AM GMT
రాజకీయం క్రికెట్ లాంటిదేనంటూ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
X
కడుపులో ఉన్న దాన్ని కట్టుకున్నదానికి కూడా తెలీకుండా వ్యవహరించే ధోరణి కొందరికి ఉంటుంది. అందుకు భిన్నంగా కడుపు లో ఉన్న దాన్ని మీడియా గొట్టాల ముందుకు రాగానే కక్కేసే తీరు మరికొందరు రాజకీయ నేతల్లో ఉంటుంది. ఈ తీరు కేంద్రమంత్రి.. సీనియర్ బీజేపీ నేత నితిన్ గడ్కరీ లో కాస్త ఎక్కువనే చెప్పాలి.

ఆయన తరచూ ఓపెన్ అయిపోతంటారు. మనసు లో ఏమీ పెట్టుకోకుండా మాట్లాడేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగానే కాదు సంచలనంగా మారాయి. గడిచిన కొద్ది రోజులుగా ఎటూ తేలకుండా ఉన్న మహారాష్ట్ర రాజకీయం రెండు మూడు రోజుల్లో కీలక మలుపు తిరుగుతుందన్న వాదనలకు బలం చేకూరేలా గడ్కరీ తాజా వ్యాఖ్యలు ఉండటం విశేషం.

రాజకీయం క్రికెట్ ఆట లాంటిదని.. ఎప్పుడు ఏమైనా జరగొచ్చన్నారు. మ్యాచ్ ఓడిపోతామని కొన్నిసార్లు అనుకుంటాం కానీ ఫలితం మరోలా ఉంటుందన్నారు. చివరికి ఎవరో ఒకరికి మంచి ఫలితం లభిస్తుందన్నారు. తాజాగా ముంబయిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నోటి వెంట వచ్చిన ఈ వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.

ఢిల్లీ రాజకీయాల మీదనే తన ఫోకస్ అని చెప్పిన ఆయన మహారాష్ట్ర లో ఏం జరుగుతుందో తనకు తెలీదని తెలివి గా చెప్పిన ఆయన.. రాష్ట్రం లో ప్రభుత్వం మారినా.. గతం లో ప్రారంభించిన ప్రాజెక్టులు ఆగవని స్పష్టం చేశారు. గడ్కరీ తాజా వ్యాఖ్యలు చూస్తే.. శివసేన.. ఎన్సీపీ.. కాంగ్రెస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బలంగా ప్రయత్నిస్తున్న వేళ.. ఆ ప్రయత్నంలోని విషయాన్ని తనదైన శైలిలో రాజకీయం.. క్రికెట్ అంటూ పోలిక పెట్టి వ్యాఖ్యలు చేశారన్న మాట వినిపిస్తోంది. గడ్కరీ మాటల్ని చూస్తే..మూడు రాజకీయ పక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడతాయన్న భావన కలిగేలా ఉన్నాయని చెప్పక తప్పదు.