Begin typing your search above and press return to search.

మోదీ షాల తాజా టార్గెట్ గడ్కరీ.. ఎందుకు తప్పించినట్లు?

By:  Tupaki Desk   |   18 Aug 2022 7:30 AM GMT
మోదీ షాల తాజా టార్గెట్ గడ్కరీ.. ఎందుకు తప్పించినట్లు?
X
దేశ ప్రజలు విపరీతంగా అభిమానించి.. ఆరాధించే నరేంద్ర మోడీని ఎవరైనా ఏమైనా అంటే ఒప్పుకోని వారు బోలెడంత మంది ఉంటారు. అంత మాత్రం చేత నిజం అబద్ధం గా మారదు. ఎందుకిలా? బహిరంగా మోడీ తప్పులు కనిపిస్తున్నా.. ఆ విషయాల్ని విస్మరించటం వెనుక ఉద్దేశం ఏమిటి? అన్న ప్రశ్న పలువురిని వేధిస్తూ ఉంటుంది. దీనికి సమాధానం.. మోడీ అనుసరించిన రాజకీయ విధానమే. ఇప్పటివరకు హిందూ సమాజానికి.. వారి తరఫున బలంగా వాదనలు వినిపించటానికి సరైన నేత రాలేదని.. ఆ లోటు తీర్చే బలమైన నేతగా మోడీని భావించటమే. అతన్ని వదులుకుంటే.. మరో నేత వచ్చే అవకాశం ఇప్పట్లో లేదని.. అదే జరిగితే మళ్లీ సూడో సెక్యులరిస్టుల చేతికి రాజ్యాధికారం వెళ్లకూడదన్న భావన కూడా ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

ఈ కారణంతోనే తన గురువు లాల్ క్రిష్ణ అద్వానీ జీవిత కాల కోరిక అయిన రాష్ట్రపతి పదవికి నామినేట్ చేసే విషయంలో శిష్యుడు మోడీ ఆసక్తి చూపించకపోవటం.. ప్రపంచానికి పెద్దగా తెలియని రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి పదవికి నామినేట్ చేయడం గా చెబుతారు. తాజాగా చూసినా.. చాలామంది ఉప రాష్ట్రపతిగా వ్యవహరించి.. తన తీరుతో ఆ పదవికి వన్నె తెచ్చిన వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తారని భావించారు. కానీ.. మోడీషాల మనసుల్ని చదివేసిన వారు మాత్రం.. అదెలాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదని వాదించేవారు.

ఇప్పుడు జరిగింది చూస్తే.. మోడీని బాగా అర్థం చేసుకున్న వారి మాటే నిజమని తేలినట్లుగా చెప్పక తప్పదు. ఇలా పార్టీలో పేరున్న పెద్ద నేతలు అద్వానీ.. వెంకయ్యతో పాటు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న నేతల్ని టార్గెట్ చేయటమే మోడీ పనిగా పెట్టుకున్నారా? అంటే అవునన్న మాటను కొందరు చెబుతుంటారు. వారి వాదనల్ని నిజం చేస్తూ తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని.. పార్లమెంటరీ బోర్డు నుంచి అనూహ్యంగా తప్పించిన వైనం అందరిని సర్ ప్రైజ్ చేసింది.

నిజానికి మోడీ మంత్రివర్గంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తో పాటు.. క్లీన్ చిట్ ఉన్న సీనియర్ నేతగా ఆయనకు పేరుంది. అలాంటి ఆయన రాబోయే రోజుల్లో మోడీకి ప్రత్యామ్నాయం అవుతారన్న అంచనాలు వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే.. నితిన్ గడ్కరీ లాంటి సీనియర్ నేతను పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించిన వైనం చూసినప్పుడు.. అద్వానీ.. వెంకయ్యల తర్వాత గడ్కరీ జాబితాలో చేరారన్న మాట వినిపిస్తోంది.

మోడీగురించి తెలిసిన వారు ఈ నిర్ణయానికి పెద్దగా ఆశ్చర్యానికి గురి కారని చెబుతారు. తాను తప్పించి.. మరెవరూ ఉండకూడదన్నట్లుగా మోడీ తీరు ఉంటుందని చెబుతారు.గడ్కరీని పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించిన వైనంపై పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ స్పందించింది. ప్రజల్లో గడ్కరీ ఇమేజ్ నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యలో దాన్ని భరించలేకనే బీజేపీ ఆయన్ను పక్కన పెట్టిందన్న ఆరోపణ చేసింది.

బీజేపీలో విచక్షణ.. వివేకం ఉన్న అతికొద్దిమంది నేతల్లో గడ్కరీ ఒకరని.. తాజాగా ఆయన విషయంలో తీసుకున్న నిర్ణయం చూస్తే.. ఆయన్ని టార్గెట్ చేశారన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెబుతున్నారు. శక్తి సామర్థ్యాలు.. వ్యక్తిగత ఇమేజ్ పెరిగినప్పుడు వారంతా ఉన్నత స్థాయిలో ఉన్న వారికి సవాలుగా మారినట్లు అవుతారని.. అలాంటి వారిని స్థాయిని అమాంతం తగ్గించేలా చేయటం ఎలా అన్నది మోడీషాలకు బాగా తెలుసని చెబుతున్నారు. తాజా పరిణామం ఇదే విషయాన్ని చెబుతుందని చెప్పక తప్పదు.