Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్ చెప్పిన గడ్కరీ.. టోల్ తిప్పలకు కాస్తంత రిలీఫ్

By:  Tupaki Desk   |   23 March 2022 5:21 AM GMT
గుడ్ న్యూస్ చెప్పిన గడ్కరీ.. టోల్ తిప్పలకు కాస్తంత రిలీఫ్
X
బాదుడే బాదుడు అన్నట్లు మారిన వేళ.. అందుకు భిన్నంగా రిలీఫ్ ఇచ్చే మాటను చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. వాహనం ఇంటి నుంచి బయటకు వచ్చి.. జాతీయ రహదారిపై అడుగు పెట్టినంతనే బాదేసే టోల్ కు కాస్తంత రిలీఫ్ ఇచ్చేలా తాజా వ్యాఖ్య ఉండటం విశేషం. జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల లోపు ఉన్న టోల్ కలెక్టింగ్ పాయింట్లను వచ్చే మూడు నెలల్లో మూసి వేస్తామని చెప్పారు.

లోక్ సభలో తాజాగా ఆయన చేసిన ప్రకటన వాహనదారులకు రిలీఫ్ ఇచ్చేలా ఉంటుందని చెప్పొచ్చు. 2022-23 బడ్జెట్ లో కేటాయించిన రోడ్లు.. రహదారుల కేటాయింపుపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన గడ్కరీ 60 కిలోమీటర్ల పరిధిలో ఒకే ఒక్క టోల్ గేట్ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో.. వాహనదారుల మీద పడే భారం నుంచి కాస్తంత రిలీఫ్ పొందటం ఖాయమని చెప్పక తప్పదు.

దేశ వ్యాప్తంగా కొత్తగా నిర్మిస్తున్న హైవేల వివరాల్ని వెల్లడించారు. ఢిల్లీ-అమృత్ సర్-కత్రా ఎక్స్ ప్రెస్ వేను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేస్తామని.. ఈ ఏడాది చివరకు పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త రహదారి కారణంగా ఢిల్లీ నుంచి అమృత్ సర్ చేరుకోవటానికి కేవలం నాలుగు గంటలే పడుతుందని చెప్పారు.

అంతేకాదు.. ముంబయి నుంచి శ్రీనగర్ కు త్వరగా చేరుకునేందుకు వీలుగా కొత్తగా నిర్మిస్తున్న రహదారితో కేవలం 20 గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చని చెప్పారు.

అంతేకాదు.. కొత్తగా నిర్మిస్తున్న జమ్ము - శ్రీనగర్ హైవేను ఈ ఏడాది చివరకు పూర్తి చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరకు అందుబాటులోకి వచ్చే హైవేలలో ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేలు కూడా ఉంటాయని చెప్పారు.

ఢిల్లీ - ముంబయి దూరాన్ని కేవలం 12 గంటల వ్యవధిలో చేరుకోవచ్చని చెప్పారు. అంతేకాదు 2024 నాటికి శ్రీనగర్-లేహ్ హైవేపై సముద్ర మట్టానికి 11,650 అడుగుల ఎత్తులో ఉన్న జోజిలా పాస్ సొరంగాన్ని తెరవాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ వెల్లడించారు. మొత్తంగా ఏడాది వ్యవధిలోనే దేశీయంగా జాతీయ రహదారుల విషయంలో సరికొత్తవి మరిన్ని అందుబాటులోకి రానున్నాయన్న మాట.