Begin typing your search above and press return to search.

ట్రైలర్ మాత్రమే.. సినిమా మిగిలి ఉందన్న గడ్కరీ మాటలు ఏం చెబుతున్నాయ్?

By:  Tupaki Desk   |   29 April 2022 10:30 AM GMT
ట్రైలర్ మాత్రమే.. సినిమా మిగిలి ఉందన్న గడ్కరీ మాటలు ఏం చెబుతున్నాయ్?
X
మోడీ ప్రభుత్వంలో తనకంటూ ప్రత్యేక ఛరిష్మా ఉన్న బీజేసీ సీనియర్ నేతలు ఎవరైనా ఉన్నారంటే వారిలో ఒకరు రాజ్ నాథ్ సింగ్.. మరొకరు నితిన్ గడ్కరీ. మిగిలిన బీజేపీ నేతలకు వీరికి కాస్త తేడా ఉందనే మాట వినిపిస్తూ ఉంటుంది. సొంత ప్రభుత్వం చేసే తప్పుల్ని సైతం నితిన్ గడ్కరీ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయటం ఆయనకు అలవాటే. అప్పుడప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు హాట్ టాపిక్ అవుతుంటాయి.

కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పే మాటలు లోతైన అర్థం వచ్చేలా ఉంటాయి. శుక్రవారం హైదరాబాద్ లోని శంషాబాద్ కు వచ్చిన ఆయన.. హైవేల విస్తరణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమేం చేసింది వరుస పెట్టి చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 32 జిల్లాలకు జాతీయ రహదారుల అనుసంధానం జరిగిందని.. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు డీపీఆర్ పూర్తైందన్నారు.

‘‘ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా ఇంకా మిగిలే ఉంది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేయటానికి మూడు నెలల్లో వస్తా. తెలంగాణ డెవలప్ అయితే భారతదేశం డెవలప్ అయినట్లే. రింగ్ రోడ్డు కోసం భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి చెబుతున్నా.

నేషనల్ హైవేల వెంట లాజిస్టిక్స్ పార్కులు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా’’ అని వ్యాఖ్యానించారు. ఇదంతా చూసినప్పుడు తాను చెప్పిన అంశాలన్ని కేంద్రం నిధులతో చేసినవన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. కేంద్రం మద్దతునే తెలంగాణ రాష్ట్రం డెవలప్ మెంట్ లో పరుగులు తీస్తుందన్న అర్థం వచ్చేలా గడ్కరీ మాటలు ఉన్నాయంటున్నారు.

2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 4,996 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల్ని నిర్మించామని.. తెలంగాణలో 32 జిల్లాల్ని జాతీయ రహదారులతో లింకు చేయటం సంతోషంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా నిర్మిస్తున్న 26 ఎక్స్ ప్రెస్ హైవేలకు.. తెలంగాణలో ఐదింటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం తాము రూ.3లక్షల కోట్లు ఖర్చు చేశామని.. రూ.5వేల కోట్లతో హైదరాబాద్ - విశాఖపట్నం హైవేను ఏర్పాటు చేశామన్నారు. నాగపూర్ - విజయవాడ హైవే కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. మొత్తానికి గడ్కరీ సాబ్ హైదరాబాద్ కు వచ్చి మాట్లాడిన కొద్ది మాటలు తెలంగాణకు కేంద్రం ఏం చేసిందన్న ప్రశ్నకు వివరంగా సమాధానం చెప్పినట్లుగా ఉందని చెప్పాలి. మరి.. గడ్కరీ మాటలకు తెలంగాణ ప్రభుత్వ నేతలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.