Begin typing your search above and press return to search.

గాజువాక గురువు ఆయనేనా... ?

By:  Tupaki Desk   |   2 April 2022 11:30 AM GMT
గాజువాక గురువు ఆయనేనా... ?
X
ఆయన వైఎస్సార్ హయాంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. అదెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ముచ్చట. నాటి నుంచి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. దానికి కారణం. రాజకీయ మార్పులు, సమీకరణలు. ఇలా ఎన్నో. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి. 2004లో వైఎస్సార్ ప్రోద్బలంతో ఆయన ఫస్ట్ టైం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పెందుర్తి నుంచి గెలిచారు. ఇక 2009 నాటికి పెందుర్తి రెండుగా విభజించబడింది. గాజువాకగా కొత్త అసెంబ్లీ సీటు ఏర్పడింది.

దాంతో తిప్పల గురుమూర్తిరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడారు. అయితే నాడు కాంగ్రెస్ లో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే నాగిరెడ్డి ఇండిపెండెంట్ గా బరిలో నిలవడంతో ఓట్లు చీలి గురుమూర్తిరెడ్డి ఓటమి పాలు అయ్యారు. 2014 నాటికి ఏపీ విభజన జరగడంతో గురుమూర్తిరెడ్డి టీడీపీలో చేరి టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ దక్కలేదు. అయిదేళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నా ఏ రకమైన అధికార హోదా అందుకోకుండా పోయారు.

దీంతో 2019 ఎన్నికల ముందు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కానీ అప్పటికే నాగిరెడ్డికి టికెట్ కన్ఫర్మ్ కావడంతో ఆయన విజయానికి కృషి చేశారు. మూడేళ్ళు గడచినా వైసీపీలో మాత్రం ఏ వైభోగం దక్కలేదు. అసలు ఈ మాజీ ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారా అన్న డౌట్ ఏకంగా క్యాడర్ కే వచ్చేసింది. దాంతో ఆయన ఒక్కసారిగా మళ్లీ పూర్వ వైభవం కోసం తన పుట్టిన రోజునే అతి పెద్ద వేడుకగా మార్చేశారు.

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావుతో పాటు, నగర మేయర్, ఎంపీ సహా కీలక నతలు, అతిరధులు మహారధులు గురుమూర్తి రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో పాలుపంచుకున్నారు. దాంతో అంగరంగ వైభవంగా అవి సాగాయి. ఇక గురుమూర్తిరెడ్డిని అంతా పొగిడారు. ఆయన నాయకత్వం గొప్పదని కితాబు ఇచ్చారు.

ఆయన రాజకీయంగా ఉన్నత స్థానాలను అందుకోవాలని కోరుకున్నారు. మంత్రి అవంతి అయితే గురుమూర్తికి మంచి రోజులు వస్తాయని జోస్యం చెప్పారు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో గాజువాక టికెట్ గురుమూర్తిరెడ్డికి దక్కుతుందా అన్న చర్చ గట్టిగా ఉంది. మరో వైపు విశాఖ కొత్త జిల్లాగా మారుతోంది. సీనియర్ నాయకులు, సమర్ధులు చాలా మంది కావాలి. వైసీపీకి గట్టి నేతల కొరత విశాఖ జిల్లాలో ఉంది.

దాంతో గురుమూర్తిరెడ్డి సేవలను పార్టీ ఇక మీదట వాడుకుంటుంది అని కూడా అంటున్నారు. మొత్తానికి మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయనగా పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం ద్వారా గురుమూర్తిరెడ్డి తన రాజకీయ వ్యూహానికి తెర తీశారు అంటున్నారు.

ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గురుమూర్తిరెడ్డికి స్వయాన బాబాయ్ అవుతారు. అయితే వైసీపీ ఆయన‌కు ఇప్పటికి రెండుసార్లు టికెట్ ఇస్తే ఒకసారి ఓడి ఒకసారి గెలిచారు. వయోభారం వల్ల ఈసారి ఆయన్ని పక్కన పెట్టవచ్చు అంటున్నారు. అయితే ఆయన రాజకీయ వారసులుగా కుమారులు రేసులో ఉన్నారు. దాంతో గురుమూర్తిరెడ్డి వారితో పోటీ పడి టికెట్ ఎలా దక్కించుకుంటారో చూడాలి. వైసీపీ హై కమాండ్ కనుక ఆయన వైపు చల్లని చూపు చూస్తే మాత్రం తిప్పలు తప్పుతాయని అంటున్నారు.