Begin typing your search above and press return to search.

గాలి చేతికి సిట్ పోలీస్ బేడీలు

By:  Tupaki Desk   |   20 Nov 2015 4:03 PM GMT
గాలి చేతికి సిట్ పోలీస్ బేడీలు
X
అక్రమ మైనింగ్ కేసుల్లో నిందితుడైన గాలి జనార్దన్‌ రెడ్డికి మరో ఎదురుదెబ్బ త‌గిలింది. క‌ర్ణాట‌క లోకాయుక్త ఆదేశాల మేర‌కు స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీం(సిట్) పోలీసులు తాజాగా గాలి జ‌నార్ద‌న్ రెడ్డిని అరెస్టు చేశారు. బేలెకెరె ఓడరేవు నుంచి ఇనుప ఖనిజాన్ని అక్రమంగా ఎగుమతి చేశారనే ఆరోపణలపై ఆయనపై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో సిట్ అధికారులు ముందుగా గాలి జ‌నార్ద‌న్ రెడ్డిని విచారించారు. అనంత‌రం ఆయ‌న్ను అరెస్టు చేశారు. సిట్‌ ఐజీ చరణ్‌ రెడ్డి నేతృత్వంలోని విచారణ బృందం బెంగ‌ళూరులో గాలి జనార్ధన్‌ రెడ్డిని విచారణ చేసింది. అరెస్టుతో పాటు విచార‌ణ జ‌రిపి విష‌యాన్ని ఐజీ చ‌ర‌ణ్ రెడ్డి ధ్రువీక‌రించారు. గాలి జనార్ద‌న్ రెడ్డికి చెందిన బ్లాక్‌ గోల్డ్ ఐర‌న్ ఓర్ మైన్స్ సంస్థ అక్ర‌మ ఇనుప ఖ‌నిజం త‌ర‌లింపుపై తాము ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

గ‌తంలో ప‌లు ద‌ఫాలుగా గాలి జ‌నార్ద‌న్ రెడ్డి జైలు పాల‌యి...బెయిల్ మీద బ‌య‌టకు వ‌చ్చారు. ఓబులాపురం గ‌నుల్లో అక్ర‌మ‌ మైనింగ్ చేస్తున్న కేసులో గాలి జ‌నార్ద‌న్ రెడ్డి తొలుత‌ జైలుపాల‌య్యారు. దీంతో పాటు అనుమ‌తించిన విస్తీర్ణం కంటే ఎక్కువ ప‌రిధిలో త‌వ్వ‌కాలు చేప‌ట్టడం, రాష్ర్టాల స‌రిహ‌ద్దులు మార్చివేయ‌డం - అక్ర‌మ ర‌వాణ‌ - ముడి ఖ‌నిజం త‌ర‌లింపులో త‌ప్పుడు లెక్కలు అనే ఆరోప‌ణ‌ల‌తో గాలి జ‌నార్ద‌న్ రెడ్డి జైలుపాల‌య్యారు. ఈ క్ర‌మంలో ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ విచార‌ణ చేప‌ట్టింది. గాలిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో నిజాలు నిగ్గుతేల్చింది.

జైల్లో ఉన్న గాలి జ‌నార్ద‌న్‌ రెడ్డి బెయిల్ పొందేందుకు అనేక ప్ర‌యత్నాలు చేసిన‌ప్ప‌టికీ ఒక కేసులో బెయిల్ వ‌స్తే...మ‌రో కేసులో ఆయ‌న జైలులోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది. దీంతో దాదాపు రెండున్న‌ర ఏళ్లు ఆయ‌న జైల్లోనే ఉన్నారు. జైలులో ఉన్న స‌మ‌యంలో బెయిల్ పొందేందుకు గాలి జనార్ద‌న్‌ రెడ్డి న్యాయ‌మూర్తులకు ముడుపులు ఇచ్చార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఆ కేసులో మ‌ళ్లీ జైల్లో ఉండాల్సి వ‌చ్చింది. అనంత‌రం సుదీర్ఘ వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాజాగా బేలెకెరె ఓడరేవు నుంచి ఇనుప ఖనిజాన్ని అక్రమంగా ఎగుమతి చేశారనే కేసులో గాలి జ‌నార్ద‌న్ రెడ్డి మ‌ళ్లీ జైలు పాలు కావాల్సివ‌చ్చింది.