Begin typing your search above and press return to search.

స్వీప‌ర్ల‌కు రూ.40ల‌క్ష‌లు పంచిన గాలి?

By:  Tupaki Desk   |   25 Dec 2017 11:30 PM GMT
స్వీప‌ర్ల‌కు రూ.40ల‌క్ష‌లు పంచిన గాలి?
X
ఉండేది క‌ర్ణాట‌క‌లో అయినా.. తెలుగువాడైన ఐరెన్ ఓర్ చ‌క్ర‌వ‌ర్తి గాలి జ‌నార్ద‌న‌రెడ్డి తెలుగు ప్ర‌జ‌లంద‌రికి సుప‌రిచితం. క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో హ‌వా ప్ర‌ద‌ర్శించిన ఆయ‌న‌.. బ‌ళ్లారి బాబుగా సుప‌రిచితుడు. కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి బ‌ళ్లారిలో ఆ పార్టీ ఆన‌వాళ్లు క‌నిపించ‌కుండా చేయ‌టంలో గాలి పాత్ర ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది.
అక్ర‌మ మైనింగ్ తో కేసుల్లో చిక్కుకున్న ఆయ‌న కొంత‌కాలం జైల్లో గ‌డిపి.. ఆ మ‌ధ్య బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇప్ప‌టికి గాలికి సంబంధించి బోలెడ‌న్ని ప్ర‌చారాలు సాగుతుంటాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక న్యూస్ ఛాన‌ల్‌ కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

బోలెడ‌న్ని ఆస‌క్తిక‌ర అంశాల్ని చెప్పిన గాలి.. కొన్నేళ్ల క్రితం ట్యాంక్ బండ్ మీద స్వీప‌ర్ల‌కు రూ.40ల‌క్ష‌లు గుప్త‌దానంగా ఇవ్వ‌టంపై ప్ర‌శ్నించిన‌ప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించాడు. ట్యాంకు బండ్ మీద ఎన్టీఆర్ విగ్ర‌హాలు పెట్టించిన టైంలో ఫ్రెండ్స్ తో క‌లిసి ట్యాంక్ బండ్ కు వెళ్లిన‌ట్లు చెప్పారు. క‌ర్ణాట‌క మంత్రిగా ప‌ని చేస్తున్న‌ప్పుడు కొంత‌మంది మంత్రుల‌తో క‌లిసి విగ్ర‌హాన్ని చూసేందుకు వెళ్లాన‌ని.. అక్క‌డ బ్ర‌హ్మంగారి విగ్ర‌హం త‌న‌ను బాగా ఆక‌ట్టుకుంద‌న్నారు.

తాను విగ్ర‌హం ద‌గ్గ‌ర కూర్చున్న‌ప్పుడు అక్క‌డికి వ‌చ్చిన స్వీప‌ర్ల‌ను వాళ్ల పేర్లు అడ‌గాన‌ని.. వారు చెప్పిన పేర్ల‌న్నీ.. గోవిందు.. పోలేరు.. సిద్ధ‌య్య ఇలా బ్ర‌హ్మంగారి  నోటి నుంచి వ‌చ్చిన పేర్లే ఎక్కువ‌గా వ‌చ్చాయి. ఇది న‌న్ను క‌దిలించింది.. వెంట‌నే వారంద‌రిని పిలిపించి.. చేతికి డ‌బ్బులిచ్చా. పిల్ల‌ల్ని బాగా చ‌దువు చెప్పించాలని చెప్పా. అలా అప్ప‌ట్లో తాను చేసిన సాయం గురించి చెప్పారు.

రూ.40 కోట్లు పెట్టి తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర‌స్వామికి బంగారు కిరీటాన్ని ఇచ్చిన త‌ర్వాత క‌ష్టాలు వ‌స్తే.. దేవుడ్ని నిందించారా? అన్న ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చిన గాలి.. తాను క‌ర్మ సిద్ధాంతాన్ని న‌మ్ముతాన‌న్నారు. రాముడి కోసం గుడిని క‌ట్టించిన భ‌క్త రామ‌దాసు జైలుకు వెళ్లార‌ని.. ఆయ‌న‌పైనా.. ప్ర‌భుత్వ సొమ్ముతో ఆల‌యాన్ని క‌ట్టించార‌న్న ఆరోప‌ణ ఉంద‌ని.. కానీ ప్ర‌జ‌ల నుంచి విరాళాలు తీసుకొని గుడి క‌ట్టించిన విష‌యం త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న ఆయ‌న‌.. తాను నీతి నిజాయితీగా సంపాదించిన దాంతోనే విరాళాలు చేసిన‌ట్లు చెప్పారు. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు అబ‌ద్ధ‌మ‌ని ఏదో ఒక రోజు తెలుస్తుంద‌న్నారు.

రాహుకాలాన్ని చూసుకొని.. మంచి టైమ్‌లోనే ఇంట‌ర్వ్యూ కోసం ఇంటి ద‌గ్గ‌ర నుంచి బ‌య‌లుదేరిన‌ట్లుగా చెప్పిన గాలితో.. మ‌రి అన్ని చూసుకునే మిమ్మ‌ల్ని ఆ రాహుకేత‌వులు ఎందుకు కాపాడ‌లేక‌పోయారు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబుతూ.. రాహుకాలాలు చూసుకోవ‌టంతోనే తానిలా ఉన్నాన‌ని చెప్పారు. సామాన్య‌మైన కుటుంబం నుంచి వ‌చ్చిన త‌న‌లాంటి వాడికి తానున్న స్థాయిని ఊహించ‌లేమ‌ని.. జీవితం మ‌న‌ల్ని మ‌నం మైమ‌రిచిపోయిన‌ప్పుడు భ‌గ‌వంతుడు కొర‌డా ఝుళిపించార‌న్నారు. దేవుడు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని ప‌ని చేయాల‌ని ఒక వార్నింగ్ పంపార‌నిపించిన‌ట్లు చెప్పారు.

బంగారు ప‌ళ్లెంలో భోజ‌నం చేస్తాన‌ని.. బంగారు కుర్చీలో కూర్చుంటాన‌న్న ప్ర‌చారంలో నిజం లేద‌న్నారు. తాను ఇప్ప‌టికి సాధార‌ణ జీవితాన్ని గ‌డుపుతాన‌ని చెప్పారు. మీడియాలో వ‌చ్చిన‌వ‌న్నీ గ్రాఫిక్స్ లో సృష్టించిన‌వేన‌న్నారు. సీబీఐ వాళ్లు త‌మ ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు అక్క‌డ సామాన్ల‌ను సీజ్ చేశారు. ఒక‌వేళ‌.. ప‌ళ్లెలు.. కిరీటాలు.. బంగారు కుర్చీలు లాంటివి సీబీఐ సీజ్ చేసి ఉంటే.. ఈ పాటికి కోర్టులో ఉంచేవార‌ని.. కోర్టులో ప్ర‌వేశ పెట్టిన వ‌స్తువుల జాబితాను చూస్తే.. విష‌యం అర్థ‌మ‌వుతుంద‌న్నారు.