Begin typing your search above and press return to search.

గాలి స్కెచ్‌..క‌న్న‌డ స‌ర్కారులో తిరుగుబాటు

By:  Tupaki Desk   |   9 Jun 2018 3:21 PM GMT
గాలి స్కెచ్‌..క‌న్న‌డ స‌ర్కారులో తిరుగుబాటు
X
పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో మ‌రోమారు రాజ్యంగ సంక్షోభం త‌లెత్తే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అనేక ట్విస్టుల మ‌ధ్య పట్టాభిషేకం జ‌రిగిన జేడీఎస్ నేత కుమార‌స్వామికి ఆదిలోనే కుంపట్లు - తిరుగుబాట్లు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. 12 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేసినట్లు సమాచారం. దీంతో స‌హ‌జంగానే...కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం దినదిన గండంగా మారింది. అయితే ఈ ప‌రిణామం వెనుక ఉన్న‌ది మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న్ రెడ్డి అని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్‌ మద్దతుతో కుమారస్వామి సీఎం పీఠం దక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. కర్ణాటక రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి బీజేపీకి ముచ్చెమటలు పట్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ లలో చీలిక వచ్చినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దాదాపు 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటాను ఎగురవేసినట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో కొందరు సీనియర్ నేతలకు శాఖలు కేటాయించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. దీంతో సదరు ఎమ్మెల్యేలను సముదాయించేందుకు కర్ణాటక పీసీసీ చీఫ్‌ పరమేశ్వర - డి శివకుమార్‌ రంగంలోకి దిగి ఎమ్మెల్యేలతో జరిపిన చర్చలు సైతం విఫలమయ్యాయి. దీంతో గంటకు గంటకు తిరుగుబాటు గ్రూపులో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. సీనియర్‌ ఎమ్మెల్యేలైన ఎంబీ పాటిల్‌ - రోషన్‌ బేగ్‌ - రామలింగారెడ్డి - కృష్ణప్ప - దినేశ్‌ గుండురావు - ఈశ్వర్‌ ఖండ్రే - షమనూర్‌ శివశంకరప్ప - సతీష్‌ జాక్రిహోలిలు మంత్రి పదవులు దక్కకపోవడంతో కాంగ్రెస్‌ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉ‍న్నారు.

సిద్ధరామయ్య సర్కారులో హోం మినిస్ట్రీ చేసిన రామలింగారెడ్డితో పాటు సీనియర్లు HK పాటిల్ - రోషన్ బేగ్ కు మంత్రి పదవులు దక్కలేదు. దాంతో ఆ వర్గం అసంతృప్తితో ఉందన్న వాదనలు వినిపిస్తోంది. రామలింగారెడ్డి బీజేపీని అప్రోచ్ అయ్యారన్న ప్రచారమూ జరిగింది. ఈ ఆప‌రేష‌న్ వెనుక ఉన్న‌ది గాలి జ‌నార్ద‌న్ రెడ్డి అని ప్ర‌చారం జ‌రుగుతోంది. సామాజిక‌వ‌ర్గం స‌మీక‌ర‌ణాల‌తో పాటుగా త‌న‌తో క‌లిసి వ‌స్తే..కీల‌క‌మైన మంత్రి ప‌ద‌వులు ఇస్తామ‌ని, అసంతృప్త ఎమ్మెల్యేల‌ను బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చేలా చూడాల‌ని గాలి వ‌ర్గం మాజీ హోంమంత్రి రామ‌లింగారెడ్డికి ప్ర‌తిపాదించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో క‌న్న‌డ ప‌రిణామాలు ఏ మ‌లుపు తిర‌గ‌నున్నాయ‌నే ఉత్కంఠ కొనసాగుతోంది.