Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌కలో `గాలి రాజ‌కీయం`.. ఎవ‌రికి ప్ల‌స్‌.. ఎవ‌రికి మైన‌స్‌!

By:  Tupaki Desk   |   28 Dec 2022 2:30 AM GMT
క‌ర్ణాట‌కలో `గాలి రాజ‌కీయం`.. ఎవ‌రికి ప్ల‌స్‌.. ఎవ‌రికి మైన‌స్‌!
X
ఔను! క‌ర్ణాట‌క‌లో ఇప్పుడు గాలి రాజ‌కీయం తెర‌మీదికి వ‌చ్చింది. త‌న‌ను ఆర్థికంగా.. మాన‌సికంగా కోలుకోకుండా చేస్తున్న బీజేపీపై క‌న్నెర్ర చేస్తున్న మాజీ మంత్రి, అదే బీజేపీకి చెందిన మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి ఇప్పుడు కొత్త‌గా పార్టీ పెట్టారు. క‌ళ్యాణ రాజ్య ప్ర‌గ‌తి ప‌క్ష‌గా ఆయ‌న దీనికి నామ‌క‌ర‌ణం చేశారు. అయితే.. ఈ పార్టీ ఏర్పాటు వెనుక ఉన్న‌దేంటి? నిజంగానే క‌ళ్యాణ రాజ్య ప్ర‌గ‌తి ప‌క్ష పేరును.. అంటే. రాష్ట్రానికి మేలుచేయాల‌నే.. సంక‌ల్పం ఉందా? అంటే నూటికి నూరుపాళ్లు కానేకాదు. గాలి చెప్పిన‌ట్టు బీజేపీ త‌న‌కుటికెట్ ఇవ్వ‌డం లేదు క‌నుక కొత్త పార్టీ పెట్టారు!

ఇక‌, దీనిలో రెండో ఊసు, ధ్యాస లేనే లేదు. కేవ‌లం.. ఉన్న‌ద‌ల్లా.. బీజేపీని దెబ్బ‌కొట్టేందుకు ఎంచుకున్న ఏకైక ఆయుధం. ప్ర‌స్తుతం మైనింగ్ కింగ్ విష‌యంలో బీజేపీ రెండునాల్క‌ల ధోర‌ణిని అనుస‌రిస్తోంద‌నేది వాస్త‌వం. ఆయ‌న‌పై అనుకూల కేసులు పెట్టించ‌డం.. అనుకూల స‌మ‌యానికి ఆయ‌న‌ను వాడుకుని వ‌దిలేయ‌డం. ఆర్థికంగా కూడా ఆయ‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేయ‌డం వంటివి అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నికల్లో క‌ర్ణాట‌క అసెంబ్లీకి పోటీ చేయాల‌ని భావిస్తున్న గాలికి.. బీజేపీ టికెట్ దాదాపు నిరాక‌రించేసింది.

దీంతో గాలి.. సొంత కుంప‌టి పెట్టుకున్నారు. ఇక‌, ఈయ‌న వ‌ల్ల ఎవ‌రికి న‌ష్టం.. అంటే.. ఖ‌చ్చితంగా బీజేపీకే!! నిజానికి జనార్దనరెడ్డి పార్టీ ప్రణాళికలు, జెండా, ఉద్దేశాలు ఏవీ చెప్పకుండానే కొత్త పార్టీ పెడుతున్నానని ప్రకటించారు. దానికి ఇంకా గుర్తు రాలేదు. అంతేకాదు.. పార్టీకి అధ్యక్షుడు ఎవ‌రో కూడా తెలియ‌దు. కానీ, గాలి జనార్దనరెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ రాష్ట్రంలో ఏమైనా ప్రభావం చూపుతుందా..? చూపితే ఏ పార్టీపై ఉంటుంది.? అనే చర్చ మాత్రం ఎక్కువగా సాగుతోంది.

కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే పేరు పెట్టడాన్ని బట్టి ఎక్కువ శాతం `కల్యాణ కర్ణాటక జిల్లాల` పైనే దృష్టి పెడతారనే కోణంలో చ‌ర్చ‌లు సాగుతున్నాయి. మైనింగ్‌ కేసులో సీబీఐ అరెస్టు చేసినప్పుటి నుంచి గాలి జనార్దన్‌రెడ్డి బళ్లారిలో పట్టు కోల్పోయారు. అంతే కాకుండా తన అనుకున్న వాళ్లు కూడా దూరమయ్యారు. మంత్రి శ్రీరాములు కూడా బాగా దూరమయ్యారని ఆయన వర్గీయులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

బీజేపీతో కలిసి పనిచేసేందుకు గాలి జనార్దన్‌రెడ్డి అనేక సార్లు ప్రయత్నించినా అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. గాలి జనార్దన్‌రెడ్డికి మంత్రి శ్రీరాములు మధ్య కూడా విభేధాలు తార స్థాయికి చేరుకున్నాయని సమాచారం. శ్రీరాములు ఎదగడానికి గాలి జనార్దన్‌రెడ్డి ప్రధాన కారణం అని గాలి వర్గం అంటుంటే.. తానే లేకుంటే గాలి జనార్దన్‌రెడ్డి ఎక్కడ అంటూ శ్రీరాములు వర్గం బహిరంగంగా విమర్శిస్తోంది.

య‌డియూర‌ప్పే కీల‌కం!

గాలి కొత్త పార్టీ వెంట వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు వెళ్తారా? వెళ్ల‌రా అనేది ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. గతంలో కూడా బీఎస్ య‌డియూర‌ప్ప సొంత‌ పార్టీ పెట్టినప్పుడు చాలా మంది కార్యకర్తలు వెళ్ల‌లేదు. ఇక‌, ఆత‌ర్వాత ఆయ‌న పార్టీని బీజేపీలో విలీనం చేసేశారు. ఇక‌, ఇప్పుడు కూడా య‌డియూర‌ప్ప ఇదే సూత్రం పాటించే అవ‌కాశం ఉంది. అంటే ఎవ‌రినీ గాలి వైపు వెళ్ల‌కుండా చేయాల‌నేది ఫార్ములా. సో.. యడియూర‌ప్ప యాక్టివ్ అయితే.. జ‌నార్ద‌న్‌రెడ్డిపార్టీ ఇబ్బంది ప‌డుతుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

కాంగ్రెస్‌లోనూ ధైర్యం!

కాంగ్రెస్‏లో కూడా గాలి పార్టీపై చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్‌ ఓటర్లను గాలి జనార్దన్‌రెడ్డి ఏమాత్రం చీల్చలేరని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. రాయచూరు, బళ్లారి, కొప్పళ, యాదగిరి, గుల్బర్గా, బీదర్‌ జిల్లాల్లో ఎక్కువ మంది అభ్యర్థులను పార్టీ తరపున ఎన్నికల్లో నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఆర్థిక బ‌ల‌మే ద‌న్ను!

గాలి విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఆయ‌న‌కు ఉన్న ఏకైక‌, ప్ర‌ధాన బ‌లం ఆర్థిక‌మే. వ్యాపారాలు.. వ్య‌వ‌హారాల కార‌ణంగా ఆయ‌న కూడ‌బెట్టిన వేల కోట్ల‌ను ఇప్పుడురాజ‌కీయాల్లో కుమ్మ‌రించి.. త‌న ప్ర‌తిష్టను పెంచుక‌నేప్ర‌య‌త్నం చేయొచ్చ‌ని కొన్ని వ‌ర్గాలు అంటున్నాయి. ప్ర‌ధానంగా బీజేపీకి చెక్ పెట్ట‌లేక‌పోయినా.. ఆ పార్టీ.. త‌న‌ను ప్ర‌ధాన నేత‌గా గుర్తించే స్తాయికి ఎద‌గాల‌నేది గాలి ప్ర‌య‌త్నం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.