Begin typing your search above and press return to search.

అంత మాట అనేయటం బాగోలేదమ్మా గాలి

By:  Tupaki Desk   |   19 April 2016 4:18 PM GMT
అంత మాట అనేయటం బాగోలేదమ్మా గాలి
X
ఏపీలో అధికార.. విపక్ష నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. నువ్వు ఒకటంటే.. నేను రెండంటా అంటూ ఓ రేంజ్ లో చెలరేగిపోతున్నారు. తమ పార్టీపై ఆపరేషన్ ఆకర్ష్ ఆస్త్రాన్ని ప్రయోగిస్తున్న ఏపీ అధికారపక్షంపై జగన్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా ఏలా విరుచుకుపడింది తెలిసందే. తెలుగుదేశం పార్టీలో మగాళ్లు లేకనే.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని ఏపీ ముఖ్యమంత్రి తీసుకెళుతున్నారంటూ ఆమె మండిపడ్డారు. ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఏపీ అధికారపక్షం అనుసరిస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. రోజా మాటల్ని ఎవరూ సమర్థించలేదు.

ఆ మాటకు వస్తే.. గతంలో వైఎస్.. ఆ తర్వాత జగన్ కూడా ఇలాంటి ఆకర్ష్ లను ప్రయోగించిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్న వేళ రోజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇదిలా ఉంటే.. రోజాకు మించి అడ్డదిడ్డంగా మాట్లాడే అలవాటున్న టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు చేసిన వ్యాఖ్యలు వామ్మో అనేలా ఉన్నాయి. టీడీపీలో మగాళ్లు లేరా? అన్న రోజా వ్యాఖ్యకు కౌంటర్ ఇచ్చేందుకు గాలి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంతకీ గాలి చేసిన వ్యాఖ్యలేమిటంటే.. టీడీపీలో మగాళ్లు లేరంటున్న రోజా టెస్టింగ్ ఏజెన్సీ ఏమైనా పెట్టారా? అంటూ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో అంతా సమానమేనన్నఆయన రోజాది ఐరెన్ లెగ్ అంటూ విమర్శించారు. జగన్ పార్టీ ఎమ్మెల్యేల్ని డబ్బులు పెట్టి కొంటున్నట్లుగా చేస్తున్న జగన్ ఆరోపణల్ని ఖండించిన గాలి.. గతంలో రోజా.. బాలనాగిరెడ్డి.. ప్రసన్నకుమార్ రెడ్డికి ఎన్ని డబ్బులు ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చారో చెప్పాలంటూ గాలి సూటిగా ప్రశ్నించారు. మిగిలిన వ్యాఖ్యలు ఓకే అయినా.. టెస్టింగ్ ఏజెన్సీ లాంటి మాటలు గాలి లాంటి సీనియర్ నోటి నుంచి రాకుంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.