Begin typing your search above and press return to search.

పిట్టకథతో విమర్శలు సంధిస్తున్న ముద్దుకృష్ణమ

By:  Tupaki Desk   |   6 July 2015 8:35 AM GMT
పిట్టకథతో విమర్శలు సంధిస్తున్న ముద్దుకృష్ణమ
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఏపీ విపక్ష నేత వైఎస్‌ జగన్‌లపై ఏపీ టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ తన విమర్శల జోరు పెంచారు. నిన్నమొన్నటివరకూ మాజీగా ఉన్న ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలో మరింత చెలరేగిపోతున్నారు. పట్టిసీమ మొదలుకొని.. సెక్షన్‌ 8 అంశంపై పిట్టకథలతో కేసీఆర్‌.. జగన్‌లపై విమర్శల జోరు పెంచారు.

సహజంగా మాటకారి అయిన ముద్దుకృష్ణమ పిట్టకథలతో కేసీఆర్‌.. జగన్‌లపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ ఒక పిట్టకథ చెప్పుకొచ్చారు.ఒక తోడేలు సెలయేరులో పైన నీళ్లు తాగుతోంది. కిందన ఒక జింక నీళ్లు తాగుతోంది. కింద తాగుతున్న జింకపై పైన నీళ్లు తాగుతున్న తోడేలుకు కోపం వచ్చి.. నీ ఎంగిలి నీళ్లు తాగాలా అని దాడి చేసిందట.. కేసీఆర్‌.. ఆయన సర్కారు ఏపీ.. ఏపీ సర్కారుపై ఇదే తరహాలో కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.

సముద్రంలోకి వెళ్లే నీటిని రాయలసీమ గొంతు తడపాలన్న లక్ష్యంతో పట్టిసీమను నిర్మిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి.. ఏపీ విపక్ష నేత వైఎస్‌ జగన్‌లు ఏడుస్తున్నారని ఆయన మండిపడ్డారు. పట్టిసీమ అవసరం లేదని చెప్పే జగన్‌.. సెక్షన్‌ 8 కూడా అవసరం లేదని చెబుతారా? అని నిలదీస్తున్నారు.

పార్టీలో తన కంటే పెద్దవారిని తన మాటలతో.. చేష్టలతో అగౌరవపరిచే జగన్‌.. ఎప్పుడు జైలుకు వెళతారో తెలీదని చెప్పిన ఆయన.. నీళ్లు.. నిధులు ఇలా ప్రతి విషయంలోనూ కయ్యం పెట్టుకునే కేసీఆర్‌తో జగన్‌ ఎలా కుమ్మక్కు అయ్యారో అర్థం కావటం లేదని వాపోయారు. మొత్తానికి ఒకేసారి ఇద్దరి ముఖ్యనేతల్ని టార్గెట్‌ చేసి చెలరేగిపోయే కొత్త పద్ధతికి గాలి ముద్దుకృష్ణమ షురూ చేసినట్లు కనిపిస్తోంది.