Begin typing your search above and press return to search.

ముద్దుకృష్ణ‌మా?... బాబు గాలి తీసేశావే!

By:  Tupaki Desk   |   22 Nov 2017 1:30 PM GMT
ముద్దుకృష్ణ‌మా?... బాబు గాలి తీసేశావే!
X
విప‌క్షం లేని అసెంబ్లీ స‌మావేశాలు చ‌ప్ప‌గా సాగుతాయ‌నుకున్న జ‌నాల వాద‌న‌లో కొంత‌మేర‌కే వాస్త‌వ‌ముంద‌ని నిరూపిస్తున్నారు అధికార పార్టీ స‌భ్యులు, వారికి మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ స‌భ్యులు. నిజ‌మే... ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న అసెంబ్లీ స‌మావేశాల‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ బ‌హిష్క‌రించేసింది. పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూ బాబు స‌ర్కారు సాగిస్తున్న పాల‌న‌కు నిర‌స‌న‌గానే అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పార్టీ అధినేత మాట‌కు అనుగుణంగానే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు ప్ర‌స్తుత స‌మావేశాల‌కు హాజ‌రుకావ‌డం లేదు. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తుంటే... ఎమ్మెల్యేలు - ఎంపీలు - ఎమ్మెల్సీలు నియోజ‌క‌వ‌ర్గాల్లో ర‌చ్చ‌బండ‌ - ప‌ల్లెనిద్ర వంటి కార్య‌క్ర‌మాల్లో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. స‌భ‌కు రాని వైసీపీ గోల మ‌న‌కెందుకులే అనుకునేందుకు మ‌న‌స్క‌రించని కొంద‌రు అధికార పార్టీ నేత‌లు... వైసీపీ పాత్ర‌ను కూడా వారే త‌మ భుజ‌స్కందాల‌పై వేసుకున్నారు.

ఇందులో భాగంగా నేటి స‌మావేశాల్లో టీడీపీ సీనియ‌ర్ నేత - మాజీ మంత్రి - ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు ఆస‌క్తిక‌ర వాద‌న‌కు తెర తీశారు. చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరుకే చెందిన గాలి... ప్ర‌స్తావించిన అంశాలు పార్టీతో పాటు ప్ర‌భుత్వాన్ని కూడా ఇరుకున ప‌డేశాయ‌నే చెప్పాలి. అయినా స‌భ‌లో గాలి ఎలాంటి వాద‌న చేశార‌న్న విష‌యానికి వ‌స్తే.. రాష్ట్రంలో ప్ర‌త్యేకించి చిత్తూరు జిల్లాలో ప్రజలు రోగాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా... వైద్యాధికారుల్లో చలనం లేకుండా పోయిందని గాలి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. డెంగ్యూ - అంటు వ్యాధులతో చిత్తూరు జిల్లా అతలాకుతలం అవుతోందని, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా వైద్య - ఆరోగ్య శాఖ అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక - జిల్లాలో సరైన వైద్యం అందుబాటులో లేకపోవడంతో ప్ర‌జ‌లు చెన్నై - బెంగళూరుకు వెళుతున్నారని తెలిపారు.

జిల్లా వైద్య - ఆరోగ్య శాఖ అధికారిగా ఒకే అధికారి గత 9 ఏళ్లుగా ఈ జిల్లాలోనే పని చేస్తున్నారని... ఉపాధ్యాయులను కూడా రెండు మూడేళ్లకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని, కానీ ఆ అధికారిని మాత్రం ఇదే జిల్లాలో ఎందుకు కొన‌సాగిస్తున్నారని ఆయ‌న వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్‌ ను దాదాపుగా నిల‌దీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలను మెడాల్ అనే కంపెనీకి అప్పగించారని... మెడాల్ పేరుతో భారీ స్కామ్ కు పాల్పడ్డారని గాలి ఆరోపించారు. వెర‌సి సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలోనే ఈ త‌ర‌హాలో స్కాములు జ‌రుగుతుంటే మిగ‌తా జిల్లాల ప‌రిస్థితి ఏమిట‌ని కూడా గాలి త‌న‌దైన స్టైల్లో విప‌క్ష పాత్ర పోషించేశారు. అధికార పార్టీకి చెందిన నేతే... పార్టీ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన కామినేని... ఆరోగ్యశాఖపై మంగళవారం సభలో చర్చ జరిగినప్పుడు ఏమీ మాట్లాడకుండా... ఇప్పుడు మాట్లాడితే ఎలాగని మంత్రి గాలిని ప్రశ్నించారు. వెర‌సి మిత్ర‌ప‌క్షం నేత అధికార ప‌క్షం వైపు నిలిస్తే... అధికార పార్టీకి చెందిన నేత విప‌క్ష పాత్ర‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించారు.