Begin typing your search above and press return to search.

ఆయన స్టైలు అంతే.. నోరు తెరిస్తే గాలి మాటలే!

By:  Tupaki Desk   |   11 April 2016 10:30 PM GMT
ఆయన స్టైలు అంతే.. నోరు తెరిస్తే గాలి మాటలే!
X
తెలుగుదేశం రాజకీయాల్లో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క శైలి. ప్రత్యేకించి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడుది మరొక శైలి. ఆయన చాలా అలవోకగా వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలను ఒక సాధారణ ఎమ్మెల్యే మీద అయినా సరే.. గుప్పించేయగలరు. అంతే అలవోకగా.. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని, 'సమయం వచ్చినపుడు' చూపిస్తా అని నాటకీయ డైలాగు వాడగలరు. అంతకంటె అలవోకగా, కాణిపాకంలో ప్రమాణం చేస్తా అనేస్తారు కూడా! ఇప్పుడు అలాంటి ముద్దుకృష్ణమనాయుడు కొన్ని గాలి విమర్శలతో పాటూ.. లోకేష్‌ భజనకు కూడ పూనుకుంటూ ఉండడం విశేషం.

వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిందే అని వారి పార్టీ అడుగుతోంటే.. గతంలో తెదేపా వారు కాంగ్రెస్‌లో చేరితే రాజీనామాలు అడగలేదే అంటూ ఆయన ప్రశ్నించారు. ఇదొక ఎత్తు అనుకుంటే.. తెలంగాణలో తెదేపాకు రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలు తెరాసలోచేరిపోయే మంత్రి పదవులు అనుభవిస్తోంటే వైకాపా ఎందుకు ప్రశ్నించలేదంటూ గాలి నిలదీస్తున్నారు.

ఇదేం ట్విస్టు.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి జరిగిన నష్టం గురించి నిలదీయడానికి వైకాపా ఏమైనా రాజకీయ నైతిక విలువలను ప్రచారం చేసే ధార్మిక సంస్థ కాదు కదా అని పలువురు గాలి మాటలను దెప్పిపొడుస్తున్నారు. ఏ పార్టీ అయినా తమకు నష్టం జరిగినప్పుడు దాని మీద స్పందిస్తుంది. ప్రత్యర్థి పార్టీకి అదే తరహా నష్టం జరిగితే మౌనాన్నే ఆశ్రయిస్తుంది. అదే సమయంలో తెలంగాణలో తెదేపా వారు తెరాసలో చేరినప్పుడు తెదేపా పార్టీ మొత్తం వారి రాజీనామాల్ని అడిగింది కదా.. మరి అదే నైతిక విలువలను ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి మరచిపోయారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గాలి వారి కామెడీ అంటే ఇలాగే ఉంటుంది మరి!

అదే సమయంలో ఆయన లోకేశ్‌ భజనను మరవడం లేదు. లోకేశ్‌కు మంత్రి పదవి ఇస్తే తప్పేంటి.. అదిత పార్టీ అంతర్గత వ్యవహారం అంటూ ఆయన సమర్థించుకుంటున్నారు. అయితే కనీసం బుద్ధా వెంకన్న లాగా.. నా ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేస్తా.. నా స్థానంలో లోకేశ్‌ ను మంత్రిని చేయండి అని చెప్పగల తెగువ గాలి ముద్దుకృష్ణమ నాయుడుకు ఉన్నదా? అసలే సభకు దూరం అయి, నానా పాట్లు పడి ఎమ్మెల్సీ అయి.. మంత్రి పదవి కోసం నిరీక్షిస్తున్న గాలి ముద్దుకృష్ణమనాయుడు.. ఆ త్యాగపూరిత డైలాగును మాత్రం పొరబాటున కూడా పలకరేమో!!