Begin typing your search above and press return to search.

వామ్మో ముద్దు..బాబును ఇంతలా పిసికేస్తారా?

By:  Tupaki Desk   |   21 April 2016 6:47 AM GMT
వామ్మో ముద్దు..బాబును ఇంతలా పిసికేస్తారా?
X
పొగడ్తకు పడనోళ్లు ప్రపంచంలో ఎవరూ ఉండరు. దేనికైనా పడని వారు పొగడ్తకు మాత్రం ఇట్టే పడిపోతారు. మిగిలిన రంగాలతో పోలిస్తే.. సినిమా.. రాజకీయాల్లో ఈ పొగడ్తల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. అభిమానం ఉండటం తప్పేం కాదు కానీ.. ఆ పేరుతో చెప్పే మాటలు కొన్నిసార్లు హద్దులు దాటటం అస్సలు బాగోదు. తాజాగా ఏపీ అధికారపక్ష నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యలు చూస్తే ఇదే రీతిలో ఉన్నాయని చెప్పొచ్చు.

చంద్రబాబు 66వ పుట్టినరోజు సందర్భంగా పలువురు తెలుగుదేశం నేతలు అధినేతను ఘనంగా సత్కరించటంతో పాటు.. తమ శక్తిమేర పొగిడేశారు. అయితే.. మిగిలిన వారి పొగడ్తలకు భిన్నంగా పొగిడేశారు గాలి ముద్దుకృష్ణమ నాయుడు. టీడీపీ కేంద్ర కార్యాలయంలోజరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2050 వరకూ కొనసాగుతారని చెప్పారు. లక్ ఉంటే ప్రధానమంత్రి పదవిని కూడా చేపట్టే ఛాన్స్ ఉందని చెప్పటం గమనార్హం.

గాలి మాటను చూస్తే.. మరో 36 ఏళ్లు సీఎంగా బాబు కొనసాగుతారని చెప్పినట్లు. ఇప్పుడు బాబుకు 66 ఏల్లు. అంటే.. 99 ఏళ్ల వయసులో కూడా బాబు ముఖ్యమంత్రి పదవిని ఇంతే చురుగ్గా నిర్వహిస్తారన్నది ముద్దు కృష్ణమ ఆలోచనా? ఒకవేళ అదే నిజమైతే.. చినబాబు మాటేమిటి గాలి? అంటూ కాస్త ఎటకారంగా ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. పొగడ్తలతో పిసికేయటం తప్పు కాదు కానీ.. మరీ ఇంతలా పిసకటం బాగోలేదన్న మాట వినిపిస్తోంది.