Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్సీ కొడుకు ఏటీఎం హ్యాక్‌

By:  Tupaki Desk   |   1 Dec 2016 1:47 AM GMT
టీడీపీ ఎమ్మెల్సీ కొడుకు ఏటీఎం హ్యాక్‌
X
అంశం ఏదైనా త‌న‌దైన శైలిలో స్పందించే టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు పెద్ద నోట్ల ర‌ద్దుపై త‌న‌దైన శైలిలో స్పందించారు. హ‌ఠాత్తుగా నోట్ల‌ను ర‌ద్దుచేయ‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయని గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతా ఆన్ లైన్ లావాదేవీలు చేస్తున్న క్ర‌మంలో సైబ‌ర్ దాడులు పెరిగిపోతున్నాయ‌ని తెలిపారు. సాక్షాత్తు త‌న కుమారుడి అకౌంట్ నుంచి రూ.60 వేల అక్ర‌మ‌ లావాదేవీలు జ‌రిగాయ‌ని వాపోయారు. యాక్సిస్ బ్యాంకులో ఖాతా ఉన్న త‌మ కుమారుడికి తెలియ‌కుండానే ఈ విధంగా పెద్ద మొత్తం న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింద‌ని ముద్దుకృష్ణ‌మ నాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌ను సైతం ఎయిర్ పోర్ట్ లో డిజిట‌ల్ లావాదేవీల కోసం చూస్తే సుమారు ఐదు వంద‌ల మంది లైన్లో ఉండ‌టం క‌నిపించింద‌ని తెలిపారు. త‌మ లాంటి అవ‌గాహ‌న ఉన్న‌వారికే ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదురైతే సామాన్యుల సంగ‌తి ఏమిట‌ని ముద్దుకృష్ణ‌మ నాయుడు ప్ర‌శ్నించారు.

ఈ సంద‌ర్భంగా పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై ముద్దుకృష్ణ‌మ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. సీనియ‌ర్ ఆర్థిక‌వేత్త‌ల‌తో చ‌ర్చించ‌కుండా, ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడ‌కుండా ఇలాంటి కీల‌క నిర్ణ‌యం ఏ విధంగా తీసుకుంటార‌ని ముద్దుకృష్ణ‌మ నాయుడు ప్ర‌శ్నించారు. దువ్వూరు సుబ్బారావు - వై.వి.రెడ్డి - రంగరాజన్ - రఘురామరాజన్ - అమర్త్యసేన్ లాంటి ఆర్థిక నిపుణులతో ఒక కమిటీని - ముఖ్యమంత్రులతో పొలిటికల్ కమిటీని వేసి సూచనలు తీసుకోవాల్సిందని ముద్దుకృష్ణ‌మ అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రులతో కమిటీ అని, దానికి చంద్రబాబు నాయుడు ఛైర్మన్ అని వార్త‌లు వెలువ‌రించ‌డంపై ముద్దుకృష్ణ‌మ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. పార్లమెంటులో ఐటీ సవరణ బిల్లను కూడా ప్రవేశపెట్టేసి ముఖ్యమంత్రులతో కమిటీ అంటే ఉపయోగం ఏమిటో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పంతాలకు పోవాల్సిన పనిలేదని అంద‌రినీ క‌లుపుకొని పోవాల‌ని ముద్దుకృష్ణ‌మ సూచించారు. నల్లధనం - అవినీతిని అరికట్టాల్సిందే - కానీ పేదవాడు బాధపడకుండా చేయాలి. నరేంద్ర మోడీ - అరుణ్ జైట్లీ వాస్తవాలను గ్రహించి ముందుకెళ్లాలని సూచించారు.

దేశ వ్యాప్తంగా రూ. 500 - రూ.1000 నోట్ల రద్దుపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయని గాలి ముద్దుకృష్ణమ అన్నారు. పార్లమెంట్లో ఐటీ యాక్టు అమెండ్ మెంట్ బిల్లను కూడా తెచ్చారని, దీని ప్రకారం స్వచ్ఛందంగా నల్ల ధనాన్ని ఇప్పుడు తెలియపరిస్తే 50% ట్యాక్స్ అని - తరువాత పట్టుబడితే 85% ట్యాక్స్ ఉంటుందని నిబంధనలు పెట్టిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ...ఈ విధంగా మొదటే చేసి ఉండవచ్చు అని సూచించారు. నోట్ల రద్దు రహస్యంగా చేయాల్సిన అవసరం లేదని గాలి అన్నారు. భారత దేశంలో ఇంకా 35% నిరక్ష్యరాస్యులు ఉన్నారని చెప్పిన ఆయ‌న ఆంధ్రప్రదేశ్ లోని అరకు - హిమాచల్ ప్రదేశ్ - జమ్మూకాశ్మీర్ వంటి ప్రాంతాలలో 35 కి.మీ.ల లోపు బ్యాంకులు లేని ప్రాంతాలు కూడా ఉన్నాయని వివ‌రించారు. ఆన్ లైన్ లావాదేవీలలో రైతులు పండించే పంటలకు చెల్లించే చెల్లింపులు వారివారి అకౌంట్లలో క్రెడిట్ అయ్యిందో లేదో ఎలా తెలుస్తుంది? చెక్కులు బౌన్స్ అయితే రైతులు ఎక్కడకు వెళ్లాలి?సరుకులను నిలువ చేసుకోవడానికి రైతులకు గొడౌన్లు ఎలా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. 2% అవినీతి పరులు ఉంటే 98% ప్రజలను శిక్షించడం మంచిది కాదని మోడీకి ముద్దుకృష్ణ‌మ సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/