Begin typing your search above and press return to search.

ముద్దుకృష్ణ‌మ కొడుకుల‌కు బాబేం చెప్పారు?

By:  Tupaki Desk   |   25 April 2018 5:05 AM GMT
ముద్దుకృష్ణ‌మ కొడుకుల‌కు బాబేం చెప్పారు?
X
సుదీర్ఘ‌కాలంపాటు రాజ‌కీయాల్లో సాగ‌టం ఒక ఎత్తు అయితే.. ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నాయ‌కుడిగా శాశ్విత సెలువు తీసుకోవ‌టం అంద‌రికి సాధ్య‌మ‌య్యే విష‌యం కాదు. కొంద‌రికి మాత్రమే ఆ అవ‌కాశం ఉంటుంది. అలాంటి వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత‌.. దివంగ‌త గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు ఒక‌రు.

ఆయ‌న సీనియార్టీ ఎంతంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాంటోళ్లు సైతం గాలి ముద్దుకృష్ణ‌మ‌ను అన్నా అని పిల‌వ‌టంతోపాటు.. తాను సీఎం స్థానంలో ఉన్నా.. గాలికి చాలా ప్ర‌యారిటీ ఇచ్చే వార‌ని చెబుతారు. అలాంటి గాలి.. అస్వ‌స్థ‌తో ఇటీవ‌ల మ‌ర‌ణించ‌టం తెలిసిందే. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయ‌న మ‌ర‌ణం చిత్తూరు జిల్లాలోని కొంత భాగంలో పార్టీకి ఇబ్బందిక‌రంగా మార‌నుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదిలా ఉంటే.. మ‌ర‌ణించే నాటికి ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రిస్తున్న గాలి స్థానాన్ని ఇప్పుడు ఎవ‌రికి కట్ట‌బెడ‌తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మ తండ్రి స్థానాన్ని త‌మ‌కే ఇవ్వాలంటూ గాలి కుమారులు ఇద్ద‌రూ పోటీ ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిశారు. త‌మ తండ్రి ఎమ్మెల్సీ ప‌ద‌విని త‌మ‌కు ఇవ్వాల్సిందిగా కోరారు.

దీనికి స్పందించిన చంద్ర‌బాబు.. తొలుత కుటుంబ‌మంతా కూర్చొని ఆలోచించుకొని.. ఏకాభిప్రాయానికి రావాల‌ని.. ఆ త‌ర్వాత త‌న‌కు ఆ విష‌యాన్ని చెబితే.. ఎమ్మెల్సీ ఎంపిక విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ముద్దుకృష్ణ‌మ‌కు ఇద్ద‌రు కుమారులు. వారిలో ఒక‌రి పేరు భాను ప్ర‌కాశ్ కాగా మ‌రొక‌రి పేరు జ‌గ‌దీష్. వీరిద్ద‌రూ త‌మ తండ్రి ఎమ్మెల్సీ ప‌ద‌విని ఆశిస్తున్నారు. త‌మ‌కే క‌ట్ట‌బెట్టాల‌ని కోరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో బాబును క‌లిసిన ముద్దుకృష్ణ‌మ కొడుకుల‌కు చంద్ర‌బాబు ఒక సూచ‌న చేశారు.

తండ్రి ప‌ద‌వి ఎవ‌రికి ఇవ్వాల‌న్న అంశంపై కుటుంబ‌మంతా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి చెబితే.. తాను మిగిలిన విష‌యాల్ని చూస్తాన‌ని మాట ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ముద్దుకృష్ణ‌మ కొడుకుల‌కే విష‌యాన్ని వ‌దిలేయ‌కుండా చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి అమ‌ర‌నాథ్ రెడ్డి.. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వ‌ర్ల రామ‌య్య‌.. చిత్తూరుజిల్లా పార్టీ అధ్య‌క్షుడు నానిల‌కు గాలి క‌టుంబంతో మాట్లాడాల‌ని సూచించిన‌ట్లుగా తెలుస్తోంది.