Begin typing your search above and press return to search.

బాబు మంచిత‌నం కేసీఆర్ వాడేసుకుంటున్నార‌ట‌

By:  Tupaki Desk   |   26 Oct 2016 4:11 PM GMT
బాబు మంచిత‌నం కేసీఆర్ వాడేసుకుంటున్నార‌ట‌
X
వాస్తు కార‌ణాల రీత్యా ప్ర‌స్తుత‌ స‌చివాల‌యం కూల్చేసి నూత‌న స‌చివాల‌యం నిర్మించేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దూకుడుగా ముందుకు వెళుతుండ‌టం తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ వివాదానికి కార‌ణం అవుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. సెక్ర‌టేరియ‌ట్ కూల్చేస్తున్న నేప‌థ్యంలో హైద‌రాబాద్ లోని ప్ర‌భుత్వ భ‌వనాల‌ను త‌మ అవ‌సరాల రీత్యా తెలంగాణ ప్ర‌భుత్వం వాడుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఏపీ హ‌క్కుల‌కు భంగం క‌లుగుతోంద‌ని ఆ రాష్ట్ర ప్ర‌జాప్ర‌తినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మెత‌క‌వైఖ‌రి వ‌ల్లే ఇలా జ‌రుగుతోంద‌ని ఏపీ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కుల కోణంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సామ‌ర‌స్య దోర‌ణిని తెలంగాణ సీఎం కేసీఆర్ అర్థం చేసుకోవాల‌ని గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు కోరారు. చంద్ర‌బాబు మంచిత‌నాన్నికేసీఆర్ వాడుకుంటున్నార‌ని అయితే ఇది స‌రైన‌ది కాద‌న్నారు. పరిపాలన సౌలభ్యం కోసం అమరావతి పరిపాలన సాగిస్తుంటే, హైదరాబాద్‌ లో ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసిన భవనాలను త‌మ‌కు అప్పగించాలని క్యాబినెట్లో తీర్మానం చేసి, గవర్నర్ మధ్యవర్తిత్వం ద్వారా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాయబారం పంపించడం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. హైదరాబాద్‌ లో నిజాం రాజు నిర్మించిన భవనాలపై తెలంగాణకు ఎంత హక్కు ఉందో ఆంధ్రప్రదేశ్ కు కూడా హక్కు ఉందన్నారు. హైదరాబాద్‌లోని జెన్‌ కో ట్రాన్స్‌ కో భవనాలు - ఆర్టీసీ భవన్ - పర్యావరణ భవన్ మొదలైన భవనాలను ఎన్టీఆర్ - చంద్రబాబు నాయుడు పాలనలో నిర్మించడం జరిగిందని గుర్తుచేశారు. అయిన‌ప్ప‌టికీ త‌మ‌కే ద‌క్కాల‌ని కోరడం చూస్తుంటే కేసీఆర్ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహారిస్తున్నారనేది స్ప‌ష్టం అవుతోంద‌ని గాలి ముద్దుకృష్ణ‌మ అన్నారు.

రెండు తెలుగు రాఫ్రాల మధ్య వివాదాలకు తావులేకుండా సామారస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఏపీ సీఎం చంద్ర‌బాబు చూస్తుంటే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆ విష‌యాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని గాలి మండిప‌డ్డారు. ఆస్తుల గురించి మాట్లాడుతున్న కేసీఆర్ విభజన చట్టంలో పేర్కొన్న 9 - 10 షెడ్యూల్ల‌లోని 175 సంస్థలు కాకుండా ఈ రెండింటి పరిధిలోకి రానివి 37 - రాజ్యాంగబద్దంగా ఏర్పడిన ఎన్నికల కమీషన్ - మానవ హక్కుల కమీషన్ తదితర సంస్థలు కలుపుకొని మొత్తం 216 సంస్థల విభజనపై ఎందుకు మాట్లాడడం లేదని ప్ర‌శ్నించారు. ఉద్యోగుల విభజనకు కమల్ నాథన్ కమిటీ వేస్తే దానికి సహకరించడ లేద‌ని, ఉమ్మడి సంస్థల విభజనపై కేంద్రం షీలాబేడి కమిటీ వేస్తే దాన్ని పక్కన పెట్టార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీ విద్యుత్ సంస్థలకు రూ. 4,262 కోట్లు బ‌కాయిలు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం లేద‌ని అయితే బ‌కాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తే త‌మ‌కు విద్యుత్ అవసరం లేదని మాట్లాడుతుండ‌టం ఏమిట‌ని గాలి ముద్దుకృష్ణ‌మ ప్ర‌శ్నించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ త‌ర‌హాలో రెచ్చ‌గొట్టే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని గాలి ముద్దుకృష్ణ‌మ అభిప్రాయ‌ప‌డ్డారు. ఢిల్లీలో ఏపీ భవన్ మాదిరిగా హైదరాబాద్‌ లో ఏపీ భవన్ ఏర్పాటు చేసుకునేందుకు జూబ్లీహాల్ - మర్రి చెన్నారెడ్డి భవన్‌ ల‌ను ఏపీకి అప్పచెప్పాలని డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/