Begin typing your search above and press return to search.

రోజాకు రూట్ క్లియర్..గెలుపు నల్లేరు మీద నడక

By:  Tupaki Desk   |   2 Aug 2018 6:38 AM GMT
రోజాకు రూట్ క్లియర్..గెలుపు నల్లేరు మీద నడక
X
చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గ రాజకీయాలు సిటింగ్ ఎమ్మెల్యే - వైసీసీ నేత రోజాకు అత్యంత అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పటికే ఆమె అక్కడ బలంగా ఉండగా.. తాజాగా ప్రత్యర్థుల్లో అనైక్యత ఆమెకు వరంగా మారుతోంది.

గత ఎన్నికల్లో రోజా నగరి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడిపై స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే.. ఆ తరువాత ఆమె నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పట్టుపెంచుకోవడంతో పాటు వైసీపీలో రాష్ట్రస్థాయి నేతగా ఎదగడంతో పాటు ఆ పార్టీకి ప్రధాన గళం కావడంతో నియోజకవర్గంలో ఆమె బలం మరింత పెరిగింది. దీంతో గాలి ఆమెను ఎదుర్కోలేరన్న ఉద్దేశంతో సినీ ఛరిష్మాతోనే రోజాను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో టీడీపీ కొద్దిరోజులు మరో మాజీ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ ను రంగంలోకి తెచ్చింది. కానీ.. ఆమె ఒకట్రెండు సార్లు మాట్లాడడం తప్ప ఆ తరువాత పొలిటికల్ స్క్రీన్ పై కనిపించలేదు.

ఇంతలో గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణించారు. దీంతో ఆ సింపథీ వచ్చే ఎన్నికల్లో పనిచేస్తుందని.. ఆయన కుమారుల్లో ఎవరో ఒకరికి టిక్కెటిస్తే రోజాను ఈజీగా ఓడించొచ్చని టీడీపీ భావించింది. కానీ.. ఇప్పుడు గాలి కుమారుల తీరు చూస్తుంటే వారిలో ఎవరికి టిక్కెటిచ్చినా ఇంకొకరు వ్యతిరేకంగా పనిచేయడం గ్యారంటీ అని తేలిపోయింది.

వచ్చే ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమ వారసుడిగా నగరి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై వివాదం నడుస్తోంది. ఇద్దరు కుమారులు పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తూ ఎవరికి వారే తామే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతూ వచ్చారు. అయితే ఇటీవల ముద్దుకృష్ణమ సతీమణి సరస్వతమ్మ వచ్చే ఎన్నికల్లో తన చిన్నకుమారుడు జగదీషే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో పెద్దకుమారుడు భాను ప్రకాశ్ సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకివెళ్తూ వేగం పెంచారు. తమ్ముడు జగదీష్ పేరును తన తల్లి ప్రకటించిన నేపథ్యంలో మౌనంగా ఉంటే తాను కనుమరుగు కావడం ఖాయమని భావించిన పెద్దకుమారుడు భానుప్రకాశ్‌ ఆదివారం యువగర్జన కార్యక్రమం నిర్వహించారు. ప్రసంగాల్లో ఎక్కడా తన గురించి చెప్పుకోకుండా చంద్రబాబు - నారా లోకేష్‌ను కీర్తిస్తూ ప్రసంగించారు. అయితే ఆఫ్‌ లైన్లో మాత్రం నియోజవకర్గంలో తన సొంతవర్గాన్ని పెంచుకునేలా మాట్లాడుతున్నారు.

తనకు టికెట్ ఇవ్వకపోతే సొంత తమ్ముడికి వ్యతిరేకంగా పనిచేసేందుకు కూడా భానుప్రకాశ్‌ వెనుకాడరని ఆయన అనుచరులు చెబుతున్నారు. అటు జగదీశ్ కూడా అదేమాట చెబుతున్నారు.