Begin typing your search above and press return to search.

మర్యాదకు ఆమెను ఎమ్మెల్సీని చేయాలట

By:  Tupaki Desk   |   12 Feb 2017 6:56 AM GMT
మర్యాదకు ఆమెను ఎమ్మెల్సీని చేయాలట
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాస్తంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పదేళ్లు పదవులకుదూరంగా ఉన్న తెలుగు తమ్ముళ్లకు.. 2014 సార్వత్రిక ఎన్నకల వేళ.. చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం తథ్యమని.. అదే జరిగితే తమకు పదవుల పంట ఖాయమన్న వాదన పలువురి నోట వినిపించింది. అయితే.. విభజన కారణంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతల ప్రవాహంతో పలువురు తమ్ముళ్లకు అవకాశాలు రాని పరిస్థితి.

ప్రభుత్వం పవర్ లోకి వచ్చిన తర్వాత.. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వచ్చిన నాయకులకు.. వారికి కావాల్సిన వారికి పదవులు ఇప్పించుకునే క్రమంలో కొందరికి అవకాశాలు మిస్ అయిన పరిస్థితి ఇదిలా ఉంటే.. తాజాగా నోటిఫికేషన్ జారీ అయిన ఎమ్మెల్సీలపై పెద్ద ఎత్తున నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఒకరి విషయంలో మాత్రం బాబు మహా ఇబ్బందిగా ఫీలవుతున్నారట.

సార్వత్రిక ఎన్నికల వేళ.. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన గల్లా అరుణకుమారి ఫ్యామిలీకి బాగానే ఆదరణ లభించిందని చెప్పాలి. మిగిలిన వారితో పోలిస్తే.. వారి ఫ్యామిలీకిబాగానే గిట్టుబాటు అయ్యిందని చెబుతారు. ఒక ఎంపీ టిక్కెట్.. ఒక ఎమ్మెల్యే టిక్కెట్టును ఇచ్చారు. అయితే.. ఎంపీ టిక్కెట్టు తీసుకున్న గల్లా జయదేవ్ విజయం సాధించినప్పటికీ.. కాంగ్రెస్ హయాంలోమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన గల్లా అరుణకుమారి మాత్రం ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆమె.. జగన్ కు అత్యంత సన్నిహితుడు.. విధేయుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె తీవ్ర నిరాశకుగురైనట్లు చెబుతారు. కొన్నిరోజులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆమె.. తర్వాత కాలంలో బాబు హాజరైన కార్యక్రమాలకు మాత్రమే వచ్చేవారు. ఈ మధ్య కాలంలో బాబుపాల్గొనే కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండటం మొదలెట్టారు. అదే సమయంలో తనను సరిగా ఆదరించటం లేదన్న సరికొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. పాలనలో తనకున్న అనుభవాన్ని బాబు సర్కారు ఉపయోగించటం లేదని.. తనకు తగిన మర్యాదను.. గౌరవాన్ని ఇవ్వటం లేదని వాపోతున్నారు.

ఈ విమర్శల జోరు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి వేళలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు తెర లేచింది. సందట్లో సడేమియా అన్నట్లుగా ఇప్పుడు గల్లావర్గం.. ఎమ్మెల్సీ పదవి మీద ఫోకస్ చేసింది. బాబు తమకు మర్యాద ఇస్తున్నట్లు అయితే.. ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరి.. మర్యాద కోసం బాబు ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.