Begin typing your search above and press return to search.

గ‌ల్లా అరుణ‌ కుమారి పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఖాయ‌మే..?!

By:  Tupaki Desk   |   15 Dec 2019 3:58 PM GMT
గ‌ల్లా అరుణ‌ కుమారి పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఖాయ‌మే..?!
X
మాజీ మంత్రి గ‌ల్లా అరుణ‌ కుమారి పొలిటిక‌ల్ రీ ఎంట్రీకి రోడ్ మ్యాప్‌ ను సిద్ధం చేసుకుంటున్న‌ట్లు టీడీపీ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుతోంది. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 2014కు ముందు వ‌ర‌కు కూడా ఆమె కాంగ్రెస్‌ లోనే సుదీర్ఘ‌కాలం పాటు కొన‌సాగారు. ఆ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసి మూడుసార్లు విజ‌యం సాధించారు. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భూగర్భ మరియు గనులశాఖ‌ మంత్రిగా ప‌నిచేశారు. అరుణ‌కుమారి వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను అందిపుచ్చుకున్నారు. దివంగ‌త మాజీ పార్లమెంటు సభ్యుడు - సామాజిక కార్యకర్త పటూరి రాజ గోపాల నాయుడు కుమార్తెగా రాజ‌కీయాల్లోకి ఆమె అడుగుపెట్టి చిత్తూరు జిల్లాలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో గల్లా ఫ్యామిలీకి రాజకీయంగానే కాకుండా పారిశ్రామికంగా ఆ ప్రాంతంలో బలంగా ఉండటంతో ప్రత్యేక ఓటు బ్యాంకు కూడా బాగానే ఉంద‌ని చెప్పాలి. 2014 ఎన్నిక‌ల‌కు కొద్దిరోజుల ముందు ఆమె కాంగ్రెస్‌ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అభ్య‌ర్థిగా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. దాదాపుగా ఆమె అప్ప‌టి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఓటమి తర్వాత గల్లా అరుణకుమారి గుంటూరులోనూ - తన వ్యాపారాల కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగానే ఉన్నారు.

దీనికి ప్ర‌ధానంగా గుంటూరు నుంచి త‌న కొడుకు ఎంపీగా ఉండ‌టంతో ఆమె ఎవ‌రో ఒక‌రు ఫ్యామిలీ నుంచి రాజ‌కీయాల్లో ఉన్నారు క‌దా స‌రిపోతుంద‌న్న భావ‌న‌తోనే ఉన్నార‌ట‌. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని చంద్ర‌బాబుకు తెల‌ప‌డంతో నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లను పులిప‌ర్తి నానికి అప్ప‌జెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న అక్క‌డి నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు.

వాస్త‌వానికి ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు గ‌ల్లా అరుణ‌కుమారి ఏమాత్రం స‌హ‌క‌రించ‌లేద‌న్న‌ది నాని వ‌ర్గీయుల ఆరోప‌ణ‌. అయితే ఏ కుటుంబానికి లేని విధంగా టీడీపీలో గ‌ల్లా ఫ్యామిలీకి బాబు ప్ర‌యార్టీ ఇచ్చారు. ఎంపీగా ఉన్న జ‌య‌దేవ్‌ తో పాటు అటు గ‌ల్లా అరుణ‌కు సైతం పొలిట్‌ బ్యూరోలో ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ చంద్ర‌గిరి నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఆక్టివ్ కావాల‌ని ఆమె ఆకాక్షిస్తున్నార‌ట‌. ఇదే విష‌యమై ఇటీవ‌ల త‌న స‌న్నిహితులతో స‌మావేశ‌మై చెప్ప‌డం ఇప్పుడు జిల్లా రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. చూడాలి ఏం జ‌రుగుతుందో..?