Begin typing your search above and press return to search.

కాషాయం గూటికి గల్లా కుటుంబం?

By:  Tupaki Desk   |   19 Aug 2020 1:00 PM GMT
కాషాయం గూటికి గల్లా కుటుంబం?
X
రాజకీయాల్లోకి పారిశ్రామికవేత్తలు వచ్చాక వారి అవసరార్థం పార్టీలు మారిపోతూనే ఉంటారన్న అపవాదును మూటగట్టుకున్నారు. ఎక్కడో ముంబైలో ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, అంబానీ వియ్యంకుడు పరిమళ్ నత్వానీ ఎంపీ పదవి కోసం వైసీపీలో చేరి దక్కించుకున్నాడు. ఇప్పుడు వైసీపీ వాసనలే లేకుండా ఢిల్లీలో వ్యవహరిస్తున్నారన్న చర్చ సాగుతోంది.

రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఇప్పుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబం బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ఆర్థికమూలాలు దెబ్బతీస్తోంది. సుజనా చౌదరి, సీఎం రమేశ్ లను దెబ్బతీసిందన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన కంపెనీకి చిత్తూరు జిల్లాలో కేటాయించిన భూములను వెనక్కి తీసుకొని షాకిచ్చింది. కోర్టుకెళ్లి గల్లా జయదేవ్ స్టే తెచ్చుకున్నాడు. అయితే గల్లాను రాజకీయంగా ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు వైసీపీ కాచుకు కూర్చుందన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి..

ఈ క్రమంలోనే టీడీపీలో ఉంటే రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోతామని.. చంద్రబాబు తమను కాపాడలేడని డిసైడ్ అయిన గల్లా అరుణ, గల్లా జయదేవ్ లు బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుకు వీరు అందుబాటులో లేకుండా పోయారట.. ఫోన్ చేసినా గల్లా జయదేవ్ లైన్లోకి రావడం లేదట.. ఈ కేసులు తప్పించుకోవడం.. రాజకీయంగా ఇబ్బంది లేకుండా చేసుకోవడానికే గల్లా జయదేవ్ బీజేపీలో చేరడానికి యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో వైసీపీ నుంచి కాచుకోవడానికి అదే సరైన మార్గంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.