Begin typing your search above and press return to search.

హోదా ఇష్యూలో గల్లాకు వందకు వంద మార్కులు

By:  Tupaki Desk   |   5 May 2016 6:15 AM GMT
హోదా ఇష్యూలో గల్లాకు వందకు వంద మార్కులు
X
ఏపీకి ప్రత్యేక హోదా లేదన్న విషయాన్ని లోక్ సభలో కేంద్రమంత్రి జయంత్ సిన్హా ప్రకటించిన నేపథ్యంలో ఏపీ అధికారపక్ష ఎంపీలు సీరియస్ అయ్యారు. ఒకరిద్దరు ఎంపీలు తమ వాదనను లోక్ సభలో గట్టిగానే వినిపించారు. ప్రత్యేక హోదా లేదంటూ కేంద్రం చేసిన ప్రకటనపై గళం విప్పిన ఏపీ ఎంపీల్లో గల్లా జయదేవ్ కు ఎక్కువ మార్కులే పడ్డాయి. సుత్తి లేకుండా సూటిగా పాయింట్లోకి వెళ్లిపోయాడు.

ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలకు పార్లమెంటులోనూ.. పార్లమెంటు బయటా చాలానే మాటలు చెప్పారని.. కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదన్న విషయాన్ని స్పష్టం చేసిన గల్లా జయదేవ్.. గడిచిన రెండేళ్లలో విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీని కేంద్రం పూర్తి చేసిందో చెప్పాలంటూ నిలదీశారు. మాటలు చెప్పే టైం అయిపోయిందని స్పష్టం చేయటమే కాదు.. సాక్ష్యాత్తు ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చెప్పిన మాటలకు కూడా విలువ లేకుండా చేస్తారా? అంటూ ప్రశ్నించారు.

అంతేకాదు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ బీజేపీ తన ఎన్నికల మ్యానిఫేస్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావించలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీకి.. ఎన్నికల మేనిఫేస్టోలో ఎలా హామీ ఇచ్చారంటూ అడిగిన ప్రశ్న ఇరుకున పడేసేలా చింది. 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రకటన చేసిన కేంద్రమంత్రి.. ఉత్తరాఖండ్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఎవరి సిఫార్సుతో ప్రత్యేకహోదా ఇచ్చారన్న ప్రశ్న ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసిందని చెప్పాలి.

ఎన్డీయే మాటలతో మోసపోయామన్న భావన ఏపీ ప్రజలకు కలుగుతుందన్న విషయాన్ని స్పష్టం చేసిన గల్లా.. ఇప్పటికి మించిపోయింది లేదని.. తక్షణం ఏపీకి న్యాయం చేయాలంటూ నిలదీశారు. మాటలు వినే ఓపిక ఏపీ ప్రజలకు లేదని.. చేతలు కావాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గల్లా నాలుగు సూటి ప్రశ్నలు కేంద్రానికి సంధించారు. ఏపీకి ఎన్ని నిధులు ఎలా కేటాయిస్తారు? ఎంత కేటాయిస్తారు? ఇచ్చిన హామీల్ని ఎలా నెరవేరుస్తారు? ఎంత సమయంలోపు నెరవేరుస్తారు? అన్న విషయాల్ని పార్లమెంటులోనే స్పష్టం చేయాలని తేల్చేశారు. గల్లా జయదేవ్ మాటల్ని విన్న వారంతా ఏపీ తరఫున బలంగా వాదన వినిపించేవాడు లేడన్న కొరత తీరిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా ఇష్యూలో పార్లమెంటులో గల్లా తీరు ఆయనకు నూటికి నూరు మార్కులు పడేలా చేసిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. గల్లా బాటలో మిగిలిన ఏపీ ఎంపీలు ఎప్పటికి పయనిస్తారో..?