Begin typing your search above and press return to search.

గల్లా : ఉన్నమాటంటే ఉలుకెక్కువ!

By:  Tupaki Desk   |   2 March 2018 4:57 PM GMT
గల్లా : ఉన్నమాటంటే ఉలుకెక్కువ!
X
ఎవ్వరికైనా అంతే.. ఉన్నమాటంటే ఉలుకెక్కువ. నిజాన్ని మొహం మీదనే అడిగితే.. చర్రున శివాలెత్తిపోతారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్ లను ఎప్పుడైనా గమనించండి. ఆయన చెప్పింది వినాలే తప్ప.. మధ్యలో ఏమీ ప్రశ్నించకూడదని ఆయన కోరుకుంటారు. పైగా నిజాలను ప్రశ్నిస్తే ఆయనకు పూనకం వస్తుంది. ‘బాబూ.. నువ్వే పేపరమ్మా.. ఇలా అడగమని మీకు నేర్పించి పంపుతున్నారా?’ అంటూ సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగుతారు.

యథారాజా తథా ప్రజా అన్నట్లుగా నిజం మాట్లాడితే, అడిగితే చాలు.. పూనకంతో ఊగిపోయే ఈ పెడపోకడ చంద్రబాబు లాగానే ఆయన పార్టీ వారికి కూడా అంటుకున్నట్లుగా ఉంది. ఇవాళ ఎంపీ జయదేవ్ కు అలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు ఆయన కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. మీడియా వారి మీద చిర్రెత్తి మాట్లాడారు.

ఇంతకూ వారేమీ ఆయనను ఇబ్బంది పెట్టే మాటలు అడగలేదు. ఢిల్లీ నుంచి రాగానే సన్మానాలు చేయించుకుని.. కిరీటాలు పెట్టించుకుని.. కత్తి దూసి వేదిక మీద ఫోజులు ఇచ్చారే.. ఇంతకూ మీరందరూ కలిసి రాష్ట్రం కోసం ఏం సాధించినట్లు అని మాత్రమే అడిగారు. నిజానికి ఇది చాలా స్ట్రెయిట్ ప్రశ్న. ‘ఏం సాధించారు గనుక.. వారు సన్మానాలు చేయించుకున్నట్టు?’ అనేంత సూటిగా కూడా మీడియా వాళ్లు అడగలేదు. కానీ పన్ ప్రజల మదిలో ఉన్నది అదే.

జయదేవ్ .. పార్లమెంటులో మిస్టర్ ప్రైం మినిస్టర్ అనడం తప్ప.. ఆయన ప్రసంగంలో కొత్త సంగతులు ఏమీ లేవని.. తతిమ్మా అందరు సభ్యుల ప్రసంగాలను కూడా సమంగా గమనించిన వారు ఎవరైనా ఉంటే అర్థమవుతుంది. అలా అన్నందుకు జయదేవ్ హీరో అయిపోయాడు. ఆయన విజయవాడ శివార్లలో అడుగెట్టగానే స్వాగతాలు - ఊరేగింపులు.. సన్మానాలు.. ఇదంతా చూస్తే.. కేంద్ర ప్రభుత్వం పిలకపట్టుకుని గాల్లోకెత్తి... ప్రత్యేకహోదా ఇస్తావా చస్తావా అని డబాయించి.. హోదాను కూడా సాధించుకు వచ్చేసినంత బడాయిగా సన్మానాలు కార్యక్రమాలు జరిపించుకున్నారు. ఊరేగింపుగా ఇంటకెళ్లిపోయిన ఆయన ఇవాళ్టిదాకా మీడియా కు కంటపడలేదు.

తీరా ఇవాళ వారు అడిగేసరికి జయదేవ్ గారికి చిర్రెత్తింది. అది కార్యకర్తల ఉత్సాహం దాన్ని కాదనలేం. మాకు సన్మానాలు మీరు డిసైడ్ చేస్తారా అంటూ తలాతోకా లేకుండా మాట్లాడారు. అది కార్యకర్తల ఉత్సాహమే కావచ్చు కానీ.. ప్రజలకు అది కామెడీగా.. అర్భకుల ఆర్భాటంగా కనిపిస్తుందని.. ఎంపీగారు తెలుసుకోవాలి.