Begin typing your search above and press return to search.

కుమార‌స్వామి వ్యాఖ్య‌ల‌తో టీడీపీలో భ‌యం !

By:  Tupaki Desk   |   6 Jun 2018 1:25 PM GMT
కుమార‌స్వామి వ్యాఖ్య‌ల‌తో టీడీపీలో భ‌యం !
X
బీజేపీతో రాష్ట్రంలో - కేంద్రంలో అధికారం పంచుకుని నాలుగేళ్లు కొన‌సాగిన తెలుగుదేశం పార్టీ ప్ర‌త్యేక‌హోదా విష‌యం ప‌క్క‌న పెట్ట‌డంతో ప్ర‌జ‌ల్లో ఉన్న అసంతృప్తిని చూసి హ‌ఠాత్తుగా సంబంధాలు తెంచుకుని బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌త్యేక‌హోదా అక్క‌ర్లేదు ప్యాకేజీ చాలు అన్న చంద్ర‌బాబు బీజేపీ హోదా ఇవ్వ‌కుండా మోసం చేసింద‌ని కొత్త రాగం ఎత్తుకున్నాడు. అంతే కాదు పార్ల‌మెంటు బ‌య‌టా - లోప‌లా - ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ పార్టీ మీద అనేక ఆరోప‌ణ‌లు చేశారు. అక్క‌డితో ఆగ‌కుండా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించాల‌ని టీడీపీ నేత‌ల‌తో ప్ర‌చారం కూడా చేయించాడు.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బాబు పిలుపు బూమ‌రాంగ్ కావ‌డం - బీజేపీకి అత్య‌ధిక స్థానాలు రావ‌డం - అధికారం చేప‌ట్ట‌డంతో బ‌ల‌నిరూప‌ణ కోసం బీజేపీ ఎమ్మెల్యేల‌ను ప‌శువుల్లా కొంటుంద‌ని - ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు చంద్ర‌బాబు. అక్క‌డ బీజేపీ - కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీ నేత‌ల‌క‌న్నా చంద్ర‌బాబే ఎక్కువ ఆందోళ‌న చెంద‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పోయింది. విశ్వాస‌ప‌రీక్ష‌కు ముందే బీజేపీ దిగిపోవ‌డంతో క‌ర్ణాట‌క‌లో జేడీఎస్ - కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారానికి వెళ్లిన చంద్ర‌బాబు నాయుడు టీడీపీ బ‌ద్ద‌శ‌త్రువు అయిన కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని ఆప్యాయంగా అలింగ‌నం చేసుకోవ‌డం - సోనియాగాంధీకి వంగి వంగి దండాలు పెట్ట‌డం అంద‌రినీ ఆక‌ర్షించింది.

అవ‌న్నీ అక్క‌డితో వ‌దిలేస్తే నిన్న క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడు - కేసీఆర్ లు ఇచ్చిన స‌ల‌హా మూలంగానే తాను బీజేపీతో జ‌త‌క‌ట్ట‌కుండా కాంగ్రెస్ ను ఎంచుకున్నాన‌ని ప్ర‌క‌టించాడు. బాబు అనుకూల మీడియా ఈ వార్త‌ను తెలంగాణ‌లో కేసీఆర్ స‌ల‌హా అని రాసి - ఆంధ్రాలో చంద్ర‌బాబు నాయుడు మూలంగానే అని హైలెట్ చేశాయి.

అయితే ఉన్న‌ట్లుండి ఏమైందో గానీ కుమార‌స్వామి వ్యాఖ్య‌ల‌ను టీడీపీ గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ఖండించాడు. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ తో క‌ల‌వ‌మ‌ని కుమార‌స్వామికి చంద్ర‌బాబు నాయుడు చెప్ప‌లేద‌ని ప్ర‌క‌టించాడు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఎవరితో ముందుకు సాగాలో కాలమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చాడు. టీడీపీ 2019లో కాంగ్రెస్ తో క‌లిసి పోటీ చేస్తుంద‌న్న ఊహాగానాల నేప‌థ్యంలో దాని మూలంగా లాభం క‌న్నా న‌ష్ట‌మే ఎక్కువ‌ని అంచ‌నాకు వ‌చ్చిన చంద్ర‌బాబు కుమార‌స్వామి వ్యాఖ్య‌ల‌తో విభేదించ‌కుంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని ఈ ప్ర‌క‌ట‌న చేయించాడ‌న్న వాద‌న వినిపిస్తుంది. దాంతో పాటు బీజేపీ చేతిలో బాబు అవినీతి చిట్టా ఉంద‌ని, ఇప్ప‌టికే పీక‌ల్లోతు ఇబ్బందుల్లో ఉన్న ప‌రిస్థితుల‌లో ఇంకా ముందుకు వెళ్తే క‌ష్ట‌మేన‌న్న ఆలోచ‌న కూడా ఈ ప్ర‌క‌ట‌న‌కు కార‌ణం అని చెబుతున్నారు.