Begin typing your search above and press return to search.

ఈ ప్ర‌శ్న జ‌య‌దేవ్ కోడెల‌ను అడగాలి

By:  Tupaki Desk   |   5 Jun 2018 10:15 AM GMT
ఈ ప్ర‌శ్న జ‌య‌దేవ్ కోడెల‌ను అడగాలి
X
ఆంధ్రప్ర‌దేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌తిప‌క్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని అణ‌చాల‌నే ఉద్దేశంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు 25 మందిని - ఇద్ద‌రు ఎంపీల‌ను త‌మ‌వైపు తిప్పుకుంది. పార్టీ ఫిరాయింపు చ‌ట్టానికి విరుద్దంగా పార్టీలో చేర్చుకోవ‌డ‌మే కాకుండా మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చి అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింది. పార్టీ ఫిరాయించిన వారి శాస‌న‌స‌భ్య‌త్వాల‌ను ర‌ద్దు చేయాల‌ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు స్పీక‌ర్ కు ఫిర్యాదు చేసింది. శాస‌న‌స‌భ‌లో అనేక‌మార్లు స్పీక‌ర్ ను - ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును నిల‌దీసినా ఫ‌లితం శూన్యం.

కేంద్రంలో - రాష్ట్రంలో బీజేపీ పొత్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్లి అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల అనంత‌రం ఇప్పుడు బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌త్యేక‌హోదా హామీ సాధ్యం కాద‌ని బీజేపీ గ‌తంలో ప్ర‌క‌టించిన‌ప్పుడు హోదాక‌న్నా ప్యాకేజీనే ఉత్త‌మం అన్న చంద్ర‌బాబు గ‌త కొన్నాళ్లుగా హోదా ఇవ్వ‌లేద‌ని బీజేపీతో పేచీ పెట్టుకుని ప్ర‌భుత్వం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ప్ర‌త్యేక‌హోదాకు ప‌ట్టుబ‌డుతూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ చేసిన ఆందోళ‌న‌ల‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు రావ‌డంతో చంద్ర‌బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. చంద్ర‌బాబు కుట్ర‌ల‌ను గ‌మ‌నించిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఓ అడుగు ముందుకేసి ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు ఇచ్చారు. అయితే లోక్ స‌భ స్పీక‌ర్ వాటిని ఆమోదించ‌డం లేదు. దీంతో వారు ప‌లుమార్లు క‌లిసి ఆమోదించాల‌ని కోరారు.

ఈ నేప‌థ్యంలో బీజేపీతో క‌లిసి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాట‌కం ఆడుతుంద‌ని ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తుంది. తాజాగా గుంటూరు టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ మాట్లాడుతూ క‌ర్ణాట‌క‌లో ఎమ్మెల్యేలుగా ఎన్నిక‌యిన బీజేపీ నేత‌లు య‌డ్యూర‌ప్ప‌ - శ్రీ‌రాములు ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తే ఆమోదించిన స్పీక‌ర్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు ఎందుకు ఆమోదించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. వారిక‌న్నా ముందే వీరు రాజీనామాలు ఇచ్చినా స్పీక‌ర్ ఆమోదించ‌లేద‌ని - ఇదే బీజేపీ - వైసీపీల మ‌ధ్య సంబంధాల‌కు సాక్ష్యం అని అన్నారు.

అయితే లోక్ స‌భ స్పీక‌ర్ గురించి ఇంత మాట్లాడిన టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ మ‌రి రాష్ట్రంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టీడీపీలో చేరిన వారి గురించి స్పీక‌ర్ ఇచ్చిన ఫిర్యాదులను గుర్తు చేసుకుంటే బాగుండేది. గ‌త కొన్నేళ్లుగా వైసీపీ ఈ విష‌యంలో ప్ర‌శ్నిస్తున్నా, ఫిర్యాదులు చేసినా అనర్హులుగా వేటు వేయ‌కుండా వ‌దిలేస్తున్నారు. స్పీక‌ర్ అయిన కోడెల శివ‌ప్ర‌సాద‌రావును కూడా ఇలాగే నిల‌దీసి శాస‌న‌స‌భ్యుల మీద అన‌ర్హ‌త వేటు వేయిస్తే గ‌ల్లా జ‌య‌దేవ్ చేస్తున్న డిమాండ్ల‌కు అర్ధం ఉంటుంది. లేకుంటే ఇవి కేవ‌లం రాజ‌కీయ అవ‌కాశ‌వాద‌ విమ‌ర్శ‌లుగా మిగిలిపోతాయి అన్న‌ది గుర్తుంచుకోవాలి.