Begin typing your search above and press return to search.

మిస్ట‌ర్ ప్రైమ్ మినిస్ట‌ర్ అంటూ మ‌ళ్లీ దులిపేశాడుగా?

By:  Tupaki Desk   |   8 Feb 2019 4:55 AM GMT
మిస్ట‌ర్ ప్రైమ్ మినిస్ట‌ర్ అంటూ మ‌ళ్లీ దులిపేశాడుగా?
X
ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి బ‌లంగా చెప్పే ద‌మ్మున్న ఎంపీలు ఒక్క‌రంటే ఒక్క‌రు లేర‌నుకుంటున్న వేళ గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న సూటి ప్ర‌సంగంతో తెలుగు ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకున్న వైనం తెలిసిందే. మిస్ట‌ర్ ప్రైమ్ మినిస్ట‌ర్ అంటూ ఆయ‌న చేసిన సంబోధ‌న అప్ప‌ట్లో లోక్ స‌భ మొత్తం ఆయ‌న వైపు దృష్టి సారించేలా చేసింది. ఏపీకి ఇస్తానన్న ప్ర‌త్యేక హోదాకు సంబంధించి ఇప్ప‌టికే ప‌లుమార్లు త‌న‌దైన శైలిలో ఘాటు ప్ర‌సంగాలు చేసిన గ‌ల్లా జ‌య‌దేశ్ తాజాగా రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై ఆయ‌న మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా మోడీ ఇచ్చిన హామీల్ని ఏ రీతిలో విస్మ‌రించారో గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌ధాని మోడీ చేతిలో మ‌రోసారి మోస‌పోవ‌టానికి దేశ ప్ర‌జ‌లు సిద్ధంగా లేర‌న్న ఆయ‌న‌.. అవిశ్వాస తీర్మాన స‌మ‌యంలో తాను లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల్లో ఒక్క‌దానికి కూడా బ‌దులు ఇవ్వ‌లేక‌పోయిన వైనాన్ని గుర్తు చేశారు. త‌మ‌కిచ్చిన హామీల గురించి చెబుతారేమోన‌ని తాను నిశ్శ‌బ‌ద్దంగా వేచి చూశాన‌ని.. అయిన‌ప్ప‌టికీ వాటిని ప‌ట్టించుకోకుండా ముందుగా త‌యారు చేసుకున్న ప్ర‌సంగాన్ని చ‌దివి వెళ్లిపోయార‌న్నారు.

అహంకారం.. విజ్ఞత కోల్పోయేలా చేస్తుందని.. అంతిమంగా అది అభద్రతకు దారి తీస్తుందన్న జ‌య‌దేవ్ ప్ర‌స్తుతం బీజేపీ మొత్తం ఆ దారిలోనే సాగుతున్న‌ట్లుగా అనిపిస్తోంద‌న్నారు. ఒక‌సారి మోసం చేస్తే అది మీకు సిగ్గుచేటు అని.. రెండోసారి మోస‌పోతే మాకు సిగ్గుచేటు అవుతుందంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేసిన గల్లా.. మొత్తం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను మోడీ స‌ర్కారు మోసం చేసింద‌న్నారు.

ఎన్డీయే అధికారంలోకి వ‌స్తే ప్ర‌త్యేక హోదాను ప‌దేళ్ల‌కు.. ఢిల్లీకి మించిన రాజ‌ధానిని ఏపీలో నిర్మిస్తాన‌ని చెప్పిన మాట‌లు గుర్తు లేవా? అని ప్ర‌శ్నించారు. తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ఇచ్చిన వాగ్దానం మీద ప్ర‌ధానికి గుర్తు లేదా? అన్న ఆయ‌న‌.. ప‌లు ప్ర‌శ్న‌ల‌తో మోడీని విమ‌ర్శించారు. ద‌శాబ్దాల నుంచి ఎంతో క‌ష్ట‌ప‌డి నిర్మించుకున్న ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల్ని మోడీ స‌ర్కార్ ధ్వంసం చేస్తుంద‌న్నారు.

పార్ల‌మెంటు.. సుప్రీంకోర్టు.. ఎన్నిక‌ల సంఘం.. ఆర్ బీఐ.. సీవీసీ.. గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం.. సీబీఐ.. ఈడీల‌ను ఏ విధంగా దుర్వినియోగం చేసిందీ ఇప్ప‌టికే ప‌లువురు స‌భ్యులు చెప్పార‌న్నారు. మోడీషాలు కొన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై ఆయుధం మాదిరి ప్ర‌యోగిస్తుంద‌న్నారు. మీడియాను నియంత్రించే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తోంద‌న్నారు.